వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్‌ఐఆర్‌ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం.
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్‌ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్‌ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అంతేకాదు నెలవారీ సిప్‌ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు.
నార్మల్ ఫైర్
ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి.
లీన్ ఫైర్
లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్‌తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్‌ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి.
ఫ్యాట్ ఫైర్
లీన్‌ఫైర్‌కు విరుద్ధమైనదే ఫ్యాట్‌ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్‌ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు.
కోస్ట్ ఫైర్
మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు.
మీ ఫైర్ ఏది?
తాము ఏ ఫైర్‌ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్‌ఫైర్‌లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్‌ఫైర్‌తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం.
ఫైర్ సాధిస్తే పని మానవచ్చా?
అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్‌గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్‌ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.
ఫైర్ ఎందుకు అవసరం?
60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్‌ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్‌కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది.
ఫైర్ అంత ఈజీనా..?
కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి.
ఇవి కీలకం..
► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం.
► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు.
► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్‌ను కోల్పోవాల్సి వస్తుంది.
► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి.
► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది.
► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు.
► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు.
► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం.
Comments
Please login to add a commentAdd a comment