సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనలతో టెక్ సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, సామాన్య సంస్థల దాకా వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్, ఫేస్ బుక్ తదితర సంస్థలు తమ ఉద్యోగులు ఇంటినుంచే రిమోట్‌గా పనిచేయడానికి అనుమతినిచ్చాయి. వచ్చే ఏడాది జనవరి వరకు ఇంటినుంచే పనిచేయవచ్చని చెప్పిన అమెజాన్ తాజాగా ఈ కాలపరిమితిని మరింత పొడిగించింది.
2021, జూన్ 30 వరకు ఇంటినుండి పని చేయగల ఉద్యోగులకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ వచ్చే ఏడాది జులై వరకు, గూగుల్ 2021 జూన్ వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెరికాలోపనిచేస్తున్న19వేల మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. గిడ్డంగులను తెరిచి ఉంచడమే వైరస్ విస్తరణకు దారితీసిందంటూ గతంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు లాంటి కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని అమెజాన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment