కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న, చిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ సూత్రం మనకే కాదు దిగ్గజ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దిగ్గజ కంపెనీలకు చెందిన సాంకేతికతలో ఉన్న చిన్న లోపం వల్ల కూడా కొన్నిసార్లు వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఏమి పర్వాలేదు. టెక్ దిగ్గజ యాపిల్ కంపెనీ ఇప్పుడు అదే పని చేసింది. ర్యాన్ పిక్రెన్ అనే సైబర్ సెక్యూరిటీ విద్యార్థికి బిగ్ బౌంటీ కింద 100,500 డాలర్లు(సుమారు రూ.75 లక్షలు) ఇచ్చింది.
మ్యాక్ వెబ్‌క్యామ్‌లను హ్యాకర్లు హ్యాక్ చేసే విధంగా ఉన్న ఒక లోపాన్ని గుర్తించినందుకు యాపిల్ ఆ డబ్బులను ఇచ్చింది. ఐక్లౌడ్ షేరింగ్, సఫారీ 15తో సహ ఇతర బ్రౌజర్‌లలో వరుసగా బయటపడుతున్న లోపాల వల్ల హ్యాకర్లు వెబ్‌క్యామ్‌లను హ్యాక్ చేయవచ్చు అని ర్యాన్ పిక్రెన్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. గత ఏడాది యాపిల్ ఈ లోపాలను పరిష్కరించినట్లు వైర్డ్ మీడియా తెలిపింది. "ఈ లోపం వల్ల భాదితులు ఓపెన్ చేసిన పోర్టల్ వివరాలు అన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయి. కొన్నిసార్లు, మన వెబ్‌క్యామ్ కూడా రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపెట్టిన బగ్ మీ ఐక్లౌడ్, పే పాల్, ఫేస్ బుక్, జీమెయిల్ మొదలైన ఖాతాలను కూడా హ్యాక్ చేయగలదు" అని ఆయన ఆ పోస్టులో రాశారు.
సాధారణంగా కొన్నిసార్లు మనం డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అకస్మాత్తుగా అనేక యాదృచ్ఛిక ప్రకటనల రావడం మనం గమనిస్తుంటాం. అయితే, ఇది కూడా హ్యాకింగ్లో ఒక టెక్నిక్. గత సంవత్సరం చివరలో బయటపడిన మాక్ ఓఎస్ లోపం మీ సఫారీ ట్యాబ్, ఇతర బ్రౌజర్ సెట్టింగ్ వివరాలను దోపిడి చేసి ఉండవచ్చు అని పిక్రెన్ పేర్కొన్నారు. ఈ లోపం వల్ల హ్యాకర్లు మీ ఆన్లైన్ ఖాతాలపై నియంత్రణ పొందడమే కాకుండా, మీ మైక్రోఫోన్ ఆన్ చేయడం లేదా మీ వెబ్‌క్యామ్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. అందుకే, ముఖ్యమైన వివరాలను,పాస్‌వర్డ్‌లను ఎన్నడూ కూడా బ్రౌజర్‌లలో సేవ్ చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు వర్చువల్ కీ బోర్డ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment