పేరు: రోజీ
వయసు: 22
పౌరసత్వం: దక్షిణ కొరియా
క్వాలిఫికేషన్: మాంచి అందగత్తె
వృత్తి: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
సంపాదన : ఏడాదికి ఎనిమిదిన్నర యూఎస్ డాలర్లు
మన కరెన్సీలో.. ఆరు కోట్ల రూపాయలకు పైనే.
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు తొంభై వేల దాకా ఫాలోవర్స్ ఉన్నారు ఈ చిన్నదానికి. సుమారు వందకు పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పైగా పైసా రెమ్యునరేషన్ తీసుకోదు!!. వీటన్నింటికితోడు బోలెడంత టైమూ సేవ్ చేస్తోంది కూడా. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫొటోలు చూసి.. ‘అబ్బా ఫాలో అవుదాం.. ఫ్లర్ట్ చేద్దాం’ అనుకుంటున్నారేమో!. రోజీతో అంత వీజీ కాదు!!. ఇక్కడ మీరూ చూస్తున్న అందమైన అమ్మాయికి జీవం లేదు. ఎందుకంటే అసలు మనిషే కాదు కాబట్టి..
టెక్నాలజీ చేసిన మాయే ఇదంతా. కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించిన సూపర్ మోడల్ ఈ రోజీ.
అనంత విశ్వంలో విశాలమైన విషయం ఏదైనా ఉందీ అంటే.. అది మనిషి బుర్రే. తన పరిధిని మించి బుర్రకు పదునుపెట్టే మనిషి.. ఒక్కోసారి ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలతో అద్భుతమైన ఆవిష్కరణలకు కారణం అవుతుంటాడు. అలాంటిదే వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రెండ్. సృష్టికి ప్రతిసృష్టిలా మనిషి రూపాల్ని సృష్టించి.. వ్యాపారంలో సంచలనాలకు నెలవుగా మారుతోంది మనిషి మేధస్సు. కృత్రిమ మేధస్సు ద్వారా రోజీ లాంటి ఎన్నో క్యారెక్టర్లను సృష్టించి.. డిజిటల్ సెలబ్రిటీలతో ఫాలోవర్స్‌కు గాలం చేసి వ్యాపారం చేయిస్తున్నారు.
ఈరోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారేందుకు ఎక్కువ మందికి ఆస్కారం ఉంటోంది. అయితే విమర్శలకు తావు లేని ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సృష్టించాలనే ఆలోచన నుంచి పుట్టిందే రోజీ. అడ్వర్టైజింగ్ రంగంలో, కమర్షియల్ స్పేస్‌లో వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది ఇప్పడు సెన్సేషన్‌గా మారింది. దక్షిణ కొరియా నుంచి మొదలైన ఈ ట్రెండ్.. హ్యూమన్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు గట్టి పోటీ ఇస్తోంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. వాస్తవ ప్రపంచం, మనుషులతోనూ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు సన్నిహితంగా కదిలినట్లు బిల్డప్ ఇవ్వడం.
కిందటి ఏడాది అగష్టులో సిడూస్ స్టూడియో ఎక్స్.. రోజీని సృష్టించింది. కిందటి ఏడాది డిసెంబర్ నుంచి రోజీ అకౌంట్‌ను యాక్టివ్ చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే బిలియన్ వాన్(ఎనిమిదిన్నర లక్షల డాలర్లు) సంపాదించింది రోజీ ఏఐ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
అడ్వాంటేజ్‌లు
మనిషి కాదు.. కాబట్టి, వివాదాలకు, విమర్శలకు తావు ఉండదు. కావాలని ఎవరైనా గోల చేస్తే తప్ప అభ్యంతరాలు వ్యక్తం కావు. బోలెడంత టైం సేవ్ అవుతుంది. టెక్నికల్ అంశాలకు తప్పించి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. ఒక్కసారి క్యారెక్టర్‌ను సృష్టించడం.. అవసరమైన మార్పులు చేసుకోవడం తప్పించి పెద్ద హడావిడి ఉంటుంది. పైగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. వీటన్నింటికి తోడు జ్వరం నుంచి కరోనా లాంటి మహమ్మారులేవీ సోకలేవు. వయసు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవసరమైతే ఫాలోవర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా మార్పులు సైతం చేయొచ్చు.
దక్షిణ కొరియాలో షిన్‌హాన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ టాప్ పొజిషన్. అలాంటి కంపెనీ రోజీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ యాడ్ యూట్యూబ్‌లో 11 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
డిజిటల్ సెలబబ్రిటీలు..
విన్సెంట్.. పాతికేళ్లు దాటని కుర్రాడు. సారీ.. 100 శాతం కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్ ఇతను. సువా కూడా సూపర్ మోడల్‌గా రాణిస్తోంది. రేసిజం హద్దుల్ని చేరిపేస్తూ సృష్టించిన క్యారెక్టర్ సూడు.. శాంసంగ్, బాంమెయిన్ లాంటి బడా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. రియా కీమ్.. ఎల్జీ ఎలక్రా‍్టనిక్స్ యాడ్స్ కోసం పుట్టిన క్యారెక్టర్. అమెరికా ప్రముఖ కంపెనీ బ్రడ్.. లిల్ మిక్యుయెలా అనే డిజిటల్ సెలబ్రిటీ ద్వారా 10 మిలియన్ డాలర్లు సంపాదించింది గత ఏడాదిలో..
- సాక్షి , వెబ్‌డెస్క్ ప్రత్యేకం
చదవండి: టెక్నాలజీ చేసిన ఘోర హత్య ఇది
Comments
Please login to add a commentAdd a comment