ఓవైపు థియేటర్ యాజమాన్యాల హెచ్చరికలు.. మరోవైపు సంగ్ధిగ్ధ స్థితిలో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వెరసి.. ‘పెద్ద సినిమాల రిలీజ్’ వివాదాస్పదంగా మారుతోంది. అయితే సౌత్‌తో పోలిస్తే.. నార్త్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మరి ‘డిజిటల్’ రిలీజ్‌లతో నిర్మాతలు నిజంగా అంత లాభపడుతున్నారా?
సాక్షి, వెబ్‌డెస్క్: కిందటి ఏడాది కరోనా-లాక్‌డౌన్ టైం నుంచే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి హిందీ సినిమాలు. నెలకు కమ్‌సేకమ్ ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ఉంటుండగా, అందులో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు, అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటున్నాయి. అయితే చాలాకాలం నుంచి థియేటర్లు తెరుస్తారనే సంకేతాలు ప్రభుత్వాల నుంచి వెలువడుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ స్ట్రీమింగ్ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తోంది బాలీవుడ్. ‘భుజ్’ లాంటి భారీ ప్రాజెక్టు ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపడం అందుకు నిదర్శనం. కొసమెరుపు ఏంటంటే.. ఇలా ఓటీటీ రిలీజ్ ద్వారా ఫిల్మ్‌మేకర్స్ పెద్దగా వెనకేసుకుంటోంది ఏం లేకపోగా.. కొందరైతే నష్టాలతోనే అమ్మేసుకుంటున్నారు.
ఒరిగిందేం లేదు
ఆలస్యం చేయకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కువ రీచ్ ఉంటుందని నిర్మాతలు పైకి చెప్పుకుంటున్నప్పటికీ.. ఆర్థికంగా ఆ నిర్ణయం వాళ్లను పెద్ద దెబ్బే తీస్తోంది. కిందటి ఏడాది లాక్‌డౌన్ టైంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ. డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం ‘డిజాస్టర్’. కానీ, ఆ సీజన్‌లో వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఓటీటీ హక్కుల ద్వారా వంద కోట్ల దాకా వెనకేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో వరుణ్ ధావన్ ‘కూలీ నెం.1’ క్రిస్మస్ సీజన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. నిజానికి టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలు గనుక థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే.. మినిమమ్ వంద కోట్ల బిజినెస్.. మాగ్జిమం 250 కోట్ల దాకా ఫుల్‌రన్ బిజినెస్ చేసి ఉండేవేమో. అటుపై టాక్‌ను బట్టి శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తో అదనంగా ఆదాయం వచ్చి ఉండేది. అదే విధంగా ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ ‘రాధే’, ఫర్హాన్ అక్తర్ ‘తూపాన్’ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, వీటి రేంజ్‌కి థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే.. డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా పెద్దగా వచ్చిన లాభం ఏం లేదని బాలీవుడ్ ట్రేడ్ గణాంకాలే చెప్తున్నాయి.
అయినను ఓటీటీకే..
అక్షయ్ కుమార్ బాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన సినిమా మినిమమ్ వంద కోట్ల బిజినెస్ చేస్తుంటుంది. అలాగే అజయ్ దేవగన్‌కి కూడా వంద కోట్ల మార్కెట్ ఉంది. ఫర్హాన్ అక్తర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లకు రేంజ్ 75 కోట్ల రూపాయల పైనే. ఇక స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఎలాగూ 30 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుంటాయి. ఇలాంటి టైంలో లాభాలు తెచ్చే థియేటర్ బిజినెస్‌ను కాదని.. ఓటీటీకే ఫిక్స్ అవుతున్నారు నిర్మాతలు. త్వరలో బాలీవుడ్‌లో ‘భుజ్ ది ప్రైడ్’, సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’లు ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి. మరో నాలుగైదు సినిమాలు కొన్ని రిలీజ్ కాగా, మరికొన్ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకులనే అలరించబోతున్నాయి. మొత్తంగా థియేటర్ బిజినెస్‌తో ఇవి ఐదారు వందల కోట్ల దాకా బిజినెస్ చేయొచ్చు. కానీ, కేవలం 150 కోట్ల డీల్‌తో ముగించుకుని డిజిటల్ తెరపై సందడి చేయబోతున్నాయి.
ఇందులో భుజ్.. భారీ కాస్టింగ్, బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే నిర్మాణ ఖర్చుల కంటే తక్కువ ధరకు ఓటీటీ రిలీజ్‌కు వెళ్తుండడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అలాగే షేర్‌షా కూడా బడ్జెట్ కంటే తక్కువ మార్కెట్‌తోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన లాభాల మాటేమోగానీ.. లాస్‌తోనే ఈ రెండు సినిమాలు థియేటర్లను కాదనుకుని రిలీజ్ అవుతున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి థియేటర్‌లో భారీ సంఖ్యలో స్క్రీన్‌లపై రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఇందుకు థియేటర్-మల్టీఫ్లెక్సుల యాజమాన్యాలు అంగీకరిస్తాయా? అనేది ప్రశ్నార్థకమే.
బ్యాడ్‌మార్క్ వల్లే..
కరోనా టైం నుంచే బాలీవుడ్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్ పరిణామాలు విపరీతంగా మారిపోయాయి. ఆడియొన్స్‌లో ఇండస్ట్రీ పట్ల నెగెటివిటీ కొనసాగుతోంది. ఉదాహరణగా సడక్-2కు ఎంత దారుణంగా తిప్పి కొట్టారో తెలిసిందే. అలాగే మంచి సినిమాలకు ఆదరణ కూడా అంతంతగా మాత్రంగానే దక్కింది. అనూహ్యంగా.. ఓటీటీలో సౌత్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఈ తరుణంలోనే థియేట్రికల్ రిలీజ్‌కు బడా ఫిల్మ్ మేకర్లు వెనుకంజ వేస్తున్నారనేది ముంబైకి చెందిన ఓ సీనియర్ క్రిటిక్ అభిప్రాయం. అయితే ఇందులో నిజం లేదని, పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి మునుపటిలా మారుతుందనేది బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్నాడు. ఏదేమైనా బాలీవుడ్ మునుపటిలా కలెక్షన్లు కొల్లగట్టే స్థితికి చేరేది అనుమానమనేది చాలామంది విమర్శకుల అంటున్న మాట.
Comments
Please login to add a commentAdd a comment