ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్ గురువారం భారీ నష్టంతో ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక శాతాన్ని నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 486 పాయింట్లను కోల్పోయి నష్టపోయి 52,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 15,728 వద్ద నిలిచింది. టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. అధిక వెయిటేజీ షేర్లను కలిగిన మెటల్, బ్యాంకులు, ఆటో, ఆర్థిక రంగాల ఇండెక్సులు రెండున్నర శాతం పతనాన్ని చవిచూశాయి. మెటల్ షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్ల పతనం సూచీలకు అధిక నష్టాన్ని కలిగించింది. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకు గానూ ఐదు షేర్లు, నిఫ్టీ 50 షేర్లలో 7 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.555 కోట్ల విలువైన షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.949 కోట్ల షేర్లను విక్రయించారు.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా...
ఆసియా మార్కెట్లలో ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 11 పాయింట్లు క్షీణించి 53,066 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 15,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రమక్రమంగా అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 626 పాయింట్ల పతనమై 52,429 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 15,682 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివర్లో అరగంటలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంత నష్టాలను పూడ్చుకోగలిగాయి. ‘ప్రపంచ మార్కెట్లలోని విక్రయాల సెగలు దేశీయ మార్కెట్‌ను తాకడంతో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాలను ప్రకటనతో దలాల్ స్ట్రీల్‌లో ఆర్థిక ఫలితాల సందడి మొదలైంది. జొమాటో, పేటీఎంతో సహా మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పట్టాయి. వచ్చే వారాల్లో రెండు అంశాలు మార్కెట్ గమనానికి ఎంతో కీలకం కానున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
నష్టాలకు నాలుగు కారణాలు..!
పపంచ మార్కెట్లలో అమ్మకాలు...
చైనాకు చెందిన దిది చుక్సింగ్, టెన్సెంట్, అలీబాబాలు సంస్థలు విలీనాలు, కొనుగోలు సరైన సమాచారాన్ని ఇవ్వలేదంటూ చైనా దేశ నియంత్రణ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. దిగ్గజ కంపెనీలపై చైనా దుందుడుకు చర్యలతో ఆసియా మార్కెట్లు సెంటిమెంట్ దెబ్బతింది. హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెట్ మూడు శాతం క్షీణించి ఆరునెలల కనిష్టానికి దిగివచ్చింది. చైనా, సింగపూర్, జపాన్, థాయిలాండ్ కొరియా దేశాల స్టాక్ సూచీలు 2% వరకు నష్టపోయాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ స్టాక్ మార్కెట్లు రెండు నుంచి రెండున్నర శాతం నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
‘డెల్టా’ కేసుల పెరుగుదల భయాలు
పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ విజృంభణ ఈక్విటీ మార్కెట్లను భయపెట్టింది. ఈ ఏడాదిలోనే జూన్ 8న ఒకరోజులో అత్యధిక కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 51.7 శాతం డెల్టా వేరియంట్ అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఐరోపాలో పలు దేశాల్లో ఇదే వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
ఫెడ్ రిజర్వ్ మినిట్స్ నుంచి ప్రతికూలతలు
ఈ ఏడాదిలో వీలైనంత తొందరగా బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో డాలర్ మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. డాలర్ అనూహ్య ర్యాలీ భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
అవుట్‌లుక్ తగ్గింపు ఆందోళనలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ వృద్ధి అవుట్‌లుక్‌ను ఫిచ్ రేటింగ్స్ సంస్థ 12.8% నుంచి పదిశాతానికి తగ్గించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించడం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment