న్యూఢిల్లీ: వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్న విమానయాన సంస్థ ఎయిరిండియా అయిదేళ్ల వ్యాపార పరివర్తన ప్రణాళిక అమలుపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 పైలట్లను నియమించుకుంటోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350 పెద్ద విమానాలను అందుకోనుంది. ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఈ వివరాలను వెల్లడించారు.
ఎయిర్‌లైన్ హైరింగ్ ప్రణాళికలను ప్రస్తావిస్తూ నిర్దిష్ట టార్గెట్ అంటూ ఏదీ లేదన్న విల్సన్ .. ‘ప్రతి నెలా కొత్తగా సుమారు 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 మంది పైలట్లను తీసుకుంటున్నాం, శిక్షణనిస్తున్నాం. ఎయిర్‌లైన్ ప్రైవేటీకరణ ముందు నాటి పరిస్థితితో పోలిస్తే వార్షికంగా క్యాబిన్ సిబ్బంది నియామకాల రేటు పది రెట్లు, పైలట్లది అయిదు రెట్లు పెరిగింది‘ అని వివరించారు. ఈ ఏడాదంతా కూడా ఇదే తీరులో హైరింగ్ కొనసాగుతుందని, ఏడాది ఆఖరులో నెమ్మదించి, 2024 ఆఖర్లో మళ్లీ పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్త విమానాలు వచ్చే కొద్దీ రిక్రూట్‌మెంట్ పెరుగుతుందన్నారు.
నాలుగు సంస్థల్లో 20 వేల సిబ్బంది..
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్), విస్తారాలను ఎయిరిండియాలో విలీనం చేసే విషయంపై స్పందిస్తూ నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు ఎయిర్‌లైన్స్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకోనున్నట్లు విల్సన్ చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా కొత్తగా తీసుకుంటున్న వారు కాకుండా నాలుగు ఎయిర్‌లైన్స్‌లో కలిపి సుమారు 20,000 సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 3,900 మంది పైచిలుకు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు గత నెలలో ఉద్యోగులకు విల్సన్ తెలిపారు. వీరిలో 500 మంది పైలట్లు, 2,400 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారని వివరించారు.
122 విమానాలు ..
ప్రస్తుతం ఎయిరిండియాకు 122 విమానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా 470 విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. వీటిలో 250 విమానాలను యూరప్ దిగ్గజం ఎయిర్‌బస్ నుంచి, 220 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అమెరికన్ దిగ్గజం బోయింగ్ దగ్గర్నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిలో 40 ఎయిర్‌బస్ ఏ350లు, 20 బోయింగ్ 787లు, 10 బోయింగ్ 777–9 రకం పెద్ద విమానాలు, 210 ఎయిర్‌బస్ ఏ320/321 నియో ఎయిర్‌క్రాఫ్ట్, 190 బోయింగ్ 737 మ్యాక్స్ చిన్న విమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి చిన్న విమానం (నారో–బాడీ) జూలై లేదా ఆగస్టు నాటికి అందుకోవచ్చని విల్సన్ చెప్పా రు. అలాగే ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350, ఎనిమిది బీ777 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా తొమ్మిది బీ777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది.
సవాళ్లు..
కొన్నాళ్లుగా పెట్టుబడులు లేక సతమతమవుతున్న ఎయిరిండియా వంటి పెద్ద సంస్థను వేగంగా గాడిన పెట్టాల్సి రావడమనేది సవాలు వంటిదని విల్సన్ తెలిపారు. ఎయిర్‌లైన్‌ను గణనీయంగా మార్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. మిగతా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయడం, శిక్షణా సామరŠాధ్యలను పెంపొందించుకోవడం, ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి సాధించేలా మద్దతు కల్పించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, ఎకానమీ, ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్, సిబ్బందిలాంటి భాగస్వాములందరికీ మేలు చేసేలా దేశీ విమానయాన వ్యవస్థ ఆరోగ్యకరంగా, స్థిరంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విల్సన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment