
ముంబై: టీవీ చానళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే ప్రకటనల్లో కీలకమైన సున్నిత సమాచారానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రకటన ముందు భాగంలో ఉన్న మాదిరే, చివర్లో కీలక సమాచార వెల్లడికీ ఒకటే వేగం ఉండాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే రూ.37 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ దీన్ని పాటించేలా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ గోయల్ పర్యవేక్షణలోనే ఉంది.
మ్యూచువల్ ఫండ్ ప్రకటన చివర్లో కచ్చితంగా వెల్లడించాల్సిన డిస్‌క్లెయిమర్‌ను చాలా వేగంగా చదవడం గమనించొచ్చు. దీనిపైనే మంత్రి స్పందించారు. ‘‘డిస్ క్లెయిమర్ (తమకు బాధ్యతలేదన్న విషయాన్ని వెల్లడించడం)ను చాలా చాలా వేగంగా చదువుతున్నారు. అలా అయితే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ప్రకటనలో ముందు భాగం ఎంత వేగంతో నడిచిందో డిస్‌క్లెయిమర్ కూడా అలాగే నడవాలి. వేగంగా చదివి దాని ఉద్దేశ్యాన్ని నీరుగార్చకూడదు’’ అని ఎన్‌ఎస్‌ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు.