
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ఎంఈఐటీవై) విడుదల చేసింది.వీటి ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ.. స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్‌ఆర్‌వో) ఏర్పాటు చేసుకోవాల్సి రానుంది.
అలాగే తప్పనిసరిగా ప్లేయర్ల ధ్రువీకరణ, భారత్‌లో భౌతిక చిరునామా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. గేమ్స్ ఫలితాలపై బెట్టింగ్ చేయడానికి ఉండదు. వీటిపై పరిశ్రమ వర్గాలు జనవరి 17లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని ఎంఈఐటీవై సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తుది నిబంధనలు ఫిబ్రవరి తొలి నాళ్లలో ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దేశీయంగా ఆన్‌లైన్ గేమింగ్ రంగం వృద్ధికి, నవకల్పనలకు ప్రోత్సాహమివ్వాలనేది నిబంధనల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. 200 బిలియన్ డాలర్ల పైచిలుకు విలువ గల పరిశ్రమలో స్టార్టప్‌లు, పెట్టుబడులపరంగా ఎదిగేందుకు భారత్‌కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2021లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కోసం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనల పరిధిలో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు పని చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.