
రీటైర్‌మెంట్ తర్వాత జీవితం సాఫిగా సాగేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్‌పీఎస్)పేరిట పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది. మారిన సడలింపులు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సడలించిన నిబంధనలు
►పీఎఫ్ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన పరిమితి వరకు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.
►ఎన్‌పీఎస్ అకౌంట్‌లో జమచేసే సొమ్ము మొత్తంలో రిటైర్‌మెంట్‌కు ముందు 25 శాతం దాకా తీసుకోవచ్చు
►రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి.
►గడువుకు ముందే ఎవరైనా ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది.
►ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు.
►ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, కనీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి.
►ఒకవేళ 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి..3 సంవత్సరాల ముందే విత్‌డ్రా చేయాలనుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్‌గా ఉంటుంది.
రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి..
గతంలో ఎన్‌పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే సదుపాయం లేదు. ఉదాహరణకు పథకంలో జమ చేసిన మొత్తం రూ.2లక్షలు దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది.
కానీ తాజాగా సడలించిన నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎన్‌పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా..ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.