ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం చాట్ జీపీటీ (ChatGPT) రూపకర్త, సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ (OpenAI) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని, 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని ‘అనలైటిక్స్ ఇండియా మ్యాగజైన్’ నివేదిక పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం... తన ఏఐ సర్వీసుల్లో ఒకటైన చాట్‌జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ కంపెనీకి రోజుకు 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.80 కోట్లు) ఖర్చవుతోంది. దీంతో ఆ కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీపీటీ-3.5, జీపీటీ-4తో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ సతమతవుతోంది.
2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రారంభించిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా అవతరించింది. ప్రారంభ దశల్లో రికార్డు స్థాయిలో యూజర్ల ప్రవాహం వచ్చినా.. ఇటీవల కొన్ని నెలులుగా యూజర్ల సంఖ్యలో క్రమంగా క్షీణతను చూస్తోంది. జులై చివరి నాటికి చాట్ జీపీటీ యూజర్ బేస్ మరింత పడిపోయిందని ‘సిమిలర్ వెబ్’ డేటా చెబుతోంది. 2023 జూన్‌తో పోల్చితే జులై నెలలో యూజర్ బేస్ 12 శాతం తగ్గిందని, 1.7 బిలియన్ల నుంచి 1.5 బిలియన్లకు పడిపోయిందని పేర్కొంది.
ఇదీ చదవండి: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
కంపెనీ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్)లు కూడా వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. అనేక కంపెనీలు గతంలో తమ ఉద్యోగులను చాట్ జీపీటీని ఉపయోగించకుండా కట్టడి చేసినట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఓపెన్‌ఏఐ ఏపీఐలకు యాక్సెస్ పొందడం ప్రారంభించిన కంపెనీలు.. విభిన్న వర్క్‌ఫ్లోల కోసం వారి సొంత ఏఐ చాట్‌బాట్‌లను రూపొందించేందుకు వీలు కల్పిస్తున్నట్లు నివేదిక వివరించింది.
ఓపెన్ ఏఐ సంస్థ ఇంకా లాభాల్లోకి రాలేదని నివేదిక చెబుతోంది. గత మే నెలలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి దాని నష్టాలు 540 మిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ఓపెన్ ఏఐ కంపెనీ కొంతలోకొంత నెట్టుకొస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ 2023 సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో అది ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావించింది. కానీ నష్టాలు మాత్రమే పెరుగుతున్నందున లాభాలు అసాధ్యంగా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment