ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది.
ఐదేళ్లలో రూ.5.6 లక్షలు
కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్ డాట్ కామ్ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్ 30న ప్రకటించిన ఈ ఆఫర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.
వారికి మాత్రమే..
ఈ చైల్డ్ కేర్ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్‌ఎన్ వార్తా కథనం పేర్కొంది.
కాగా చైల్డ్ కేర్ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు) ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్ కేర్ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు.
కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
Comments
Please login to add a commentAdd a comment