న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినట్లుగా ప్రతిపాదిత డేటా భద్రత బిల్లును అమల్లోకి తెస్తే భారత్‌లో వ్యాపారాల నిర్వహణ పరిస్థితులు గణనీయంగా దెబ్బతింటాయని పలు అంతర్జాతీయ పరిశ్రమల సమాఖ్యలు కేంద్రానికి లేఖ రాశాయి. దీని వల్ల విదేశీ పెట్టుబడులు రావడం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంబంధిత వర్గాలతో విస్తృతంగా సమాలోచనలు జరపాలని కోరాయి.
భారత్‌తో పాటు అమెరికా, జపాన్, యూరప్, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు డజను పైగా పరిశ్రమల అసోసియేషన్లు మార్చి 1న కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు లేఖ రాశాయి. గూగుల్, అమెజాన్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న ఐటీఐ, జేఈఐటీఏ, టెక్‌యూకే, అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్, బిజినెస్ యూరప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లులోని నిబంధనల వల్ల దేశీయంగా కొత్త ఆవిష్కరణల వ్యవస్థకు, తత్ఫలితంగా లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్య సాకారానికి విఘాతం కలుగుతుందని లేఖలో పేర్కొన్నాయి.
వ్యక్తిగతయేతర డేటాను కూడా బిల్లు పరిధిలో చేర్చడం, సీమాంతర డేటా బదిలీతో పాటు డేటాను స్థానికంగానే నిల్వ చేయాలంటూ ఆంక్షలు ప్రతిపాదించడంపై పరిశ్రమ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధనలను అమలు చేస్తే భారత్‌లో వ్యాపారాలను సులభతరంగా నిర్వహించే వీల్లేకుండా పరిస్థితులు దిగజారుతాయని, స్టార్టప్ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment