కరోనా వైరస్.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది.. ఇంకా చూపెడుతోంది కూడా. కానీ, ఆ దేశంలో పరిస్థితిని మాత్రం ఘోరంగా దిగజార్చింది. వ్యవసాయం, విద్య, ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఎందులోనూ పైకి రాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏకంగా దేశాన్నే దివాళా వైపు అడుగులు వేయిస్తోంది.
హిందూ మహసముద్ర ద్వీప దేశం శ్రీలంక.. ఆర్థిక-మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా సమయంలో తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితులు.. అక్కడి పౌరుల జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి.
పేదరికంలోకి..
శ్రీలంకలో ఈ కరోనా టైంలో ఐదు లక్షల మంది పావర్టీ లైన్ దిగువకు చేరుకున్నారని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. ఈ పరిస్థితి ఆ దేశం ‘పేదరికంతో ఐదేళ్లపాటు పోరాడడంతో సమానమ’ని అభివర్ణించింది కూడా. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో ద్రవ్యోల్బణం 11 శాతం దాటగా, డిసెంబర్‌లో 12 శాతం పైనే కొనసాగింది. ఈ దెబ్బకి నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. మిలిటరీని రంగంలోకి దించి ప్రభుత్వ ధరలకే నిత్యావసరాలు అమ్మేలా చర్యలు చేపట్టారు. అయినా కూడా ప్రజలకు ఊరట లభించింది కొంతవరకు మాత్రమే!.
తిండి తగ్గించారు..
రాజధాని కొలంబో సహా చాలా చోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన జనాభానే కనిపిస్తోంది. ఉద్యోగాలు పొగొట్టుకుని, ఉపాధి దొరక్క తిరుగుతున్నారు. అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో తిండి తినడం తగ్గించేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. ఒక్కరోజుకి సరిపడే సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం యాభై, వంద గ్రాముల స్థాయి ప్యాకింగ్‌లు సైతం సిద్ధమవుతున్నాయి. కూరగాయల రేట్లు 50 శాతం రేట్లకు చేరడాన్నే వాళ్లు ఊరటగా భావిస్తున్నారంటే.. అంతకు ముందు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బియ్యం, బ్రెడ్డు, పాల కోసం భారీ భారీ ‘క్యూ’లు కడుతున్నారు జనాలు. పాత తరం ప్రజలకు ఈ పరిస్థితులన్నీ 70వ దశకంలో ఎదురైన సంక్షోభాన్ని గుర్తు తెస్తున్నాయట.
అప్పులంక
రుణాలు తీర్చడం ఎలా?.. ఇప్పుడు లంక ముందు ఉన్న అతిపెద్ద సమస్య. స్వదేశీ, విదేశీ రుణాలన్నింటిని కలిపి సుమారు 7.37 బిలియన్ డాలర్ల అప్పును ఈ ఏడాదిలో చెల్లించాల్సి ఉంది. ఒక్క చైనాకే 5 బిలియన్ డాలర్ల రుణం బాకీ పడింది. అంతేకాదు కరోనా టైంలో అత్యవసరాల కోసం బీజింగ్ నుంచి మరో 1 బిలియన్ డాలర్ల రుణం తీసుకుని.. దశల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే ఆర్థిక వేత్త, ప్రతిపక్ష నేత హర్ష డి సిల్వా అంచనాల ప్రకారం.. విదేశీ నిధుల నిల్వ-అప్పుల్ని బేరీజు వేసి మరీ ఈ ఏడాది అక్టోబర్ లోపే దేశం దివాళా తీయడం ఖాయమని చెబుతున్నారు. ఒకవైపు బాకీలు తీర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే చెబుతూనే.. మరోవైపు ఆర్థిక విపత్తుకు అవకాశం లేకపోలేదన్న వాదనను ప్రభుత్వం సైతం తోసిపుచ్చకపోతుండడం విశేషం. ప్రస్తుతం లంక ఖజానాలో విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి.
టూరిజం వల్లే ఇదంతా!
కరోనా వల్ల శ్రీలంకకు భారీ దెబ్బ పడింది పర్యాటక రంగం విషయంలోనే!. సుమారు 2 లక్షల మంది టూరిజం సెక్టార్, ట్రావెల్ రంగాల ద్వారా ఉపాధి కోల్పోయారని ప్రపంచం ప్రయాణ, పర్యాటక మండలి చెబుతోంది. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే.. చదువుకున్న యువత, విద్యావంతులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పాస్‌పోర్ట్ ఆఫీసుల ముందు క్యూ కట్టేంతదాకా.
బెడిసి కొట్టిన ప్రభుత్వ నిర్ణయాలు
ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే నిర్ణయాలు తీసుకోకపోవడం ఒక ఎత్తయితే.. కరెన్సీ ముద్ర-ఎక్స్‌ఛేంజ్, ప్రభుత్వ పథకాల్లో ప్రయోగాలు ఇలా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న కొన్ని నిర్ణయాలు సైతం లంక పరిస్థితిని మరింత దిగజార్చాయి. మే నెలలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద నిషేధం విధించిన ప్రభుత్వం.. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించింది. అయితే నష్టపోతామనే భయంతో చాలామంది వ్యవసాయం చేయలేదు. దీంతో ఆహార కొరత సమస్య తీవ్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యూటర్న్ తీసుకుని.. నిషేధం ఎత్తేయడం ఒక ఎత్తయితే, ఫర్టిలైజర్ల రేట్లు ఒక్కసారిగా పెంచడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది.
మరోవైపు ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక పొరుగు దేశాల నుంచి ఉత్పత్తులను, అప్పులను తీసుకుంది. అయితే అవి దీర్ఘకాలిక అప్పులు కాకపోవడంతో.. అధిక వడ్డీ రేట్లకు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పోషకాహార లోపం అక్కడ ప్రధాన సమస్యగా కొనసాగుతుండగా.. కరోనా విజృంభణ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment