సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాలలోని పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న కలెక్టర్లకు అదనంగా భవన నిర్మాణ అనుమతులు అప్పగించడం సరైంది కాదు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలో ఉన్నట్టు సాంకేతిక నిపుణులు, ఇన్‌ఫ్రా జిల్లా కేంద్రాలలో లేవు. భవన నిర్మాణ అనుమతుల ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వారంలో రెండు రోజులను కేటాయించారు. అయితే ఆ రోజుల్లో మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం ఉంటే గనక ఇక అంతే సంగతులు.
ప్రతి జిల్లాలోను టీఎస్‌బీపాస్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దాని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని’ క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం కోరింది. ఈ విషయంపై సంబంధింత మంత్రిని సంప్రదించనున్నామని తెలిపింది. క్రెడాయ్ తెలంగాణ నూతన ప్రెసిడెంట్ ఎన్నికైన డీ మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భూముల సమగ్రత, సులభతర క్రయ విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ధరణిపై సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని.. కాకపోతే దీన్ని దశల వారీగా అమలు చేస్తే మరింత సమర్థవంతంగా ఉండేదని సూచించారు. ధరణిలో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు పాత పద్ధతులను సైతం కొనసాగించాలని కోరారు. టీఎస్‌బీపాస్‌ను జిల్లాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి, అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర నగరాల్లో రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, హైదరాబాద్‌లో మాత్రం డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమగ్రవంతమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో భూముల ధరలు వంటివి ఇందుకు కారణమని తెలిపారు.
టీఎస్‌ఐసీతో జిల్లాలలో అభివృద్ధి..
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ)ని తీసుకొచ్చారని.. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. జిల్లాల విభజన, మౌలిక వసతుల అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో పోలిస్తే ఆయా జిల్లాలలో అందుబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో గృహాలకు, గిడ్డంగి సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు.
వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌తో డిమాండ్..
ఇప్పటివరకు ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సెక్రటరీ కే. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు, జిల్లాలలో పారిశ్రామిక జోన్ల అభివృద్ధి కోసం ‘వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్టీ రంగానికి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు.
క్రెడాయ్ నూతన కార్యవర్గం
కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్‌గా సీహెచ్. రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌గా డీ. మురళీ కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి, సెక్రటరీగా కే. ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షులుగా జీ. అజయ్ కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వీ. మధుసూదన్ రెడ్డి, బీ. పాండు రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా జీ. శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్‌గా ఎం. ప్రశాంత రావు ఎన్నికయ్యారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో–ఆర్డినేటర్‌గా సీ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీగా రోహిత్ ఆశ్రిత్ నియమితులయ్యారు. 2021–23 సంవత్సరానికి గాను ఈ నూతన కార్యవర్గం పదవిలో ఉంటుంది.
ప్రోత్సాహకర విధానాలు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్రం వృద్ధిపథంలో దూసుకుపోతుందని చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి చెప్పారు. టీఎస్‌ఐపాస్‌తో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలలోను చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు వచ్చాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ–హబ్, ఎస్సీ, ఎస్టీల కోసం టీప్రైడ్ వంటి వినూత్న పథకాలతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిందని.. దీంతో స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు పెరిగాయని, పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. వీటన్నింటి ప్రయోజనాలతో హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలోను గృహలకు, వాణిజ్య కేంద్రాలు, గిడ్డంగులకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
నిర్మాణ రంగంలో సాంకేతిక వినియోగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను జిల్లా చాప్టర్లకు సైతం విస్తరించేందుకు కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సభ్యులకు శిక్షణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, నీటి పొదుపు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలపై మెంబర్లకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
సంఘటిత డెవలపర్ల ప్రాజెక్ట్‌లు, అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహాలను ఒకే వేదికగా సామాన్యులకు సైతం చేరేలా అన్ని జిల్లా చాప్టర్లలోను ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 క్రెడాయ్ చాప్టర్లున్నాయని, ఈ రెండేళ్ల కాలపరిమితిలో వీటిని 20కి విస్తరిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment