Deepfake Face Swap Creates Big Headache To Indian Actresses - Sakshi
Sakshi News home page

Deepfake, Face Swap: ఇంటర్నెట్​ నిండా ఫేక్​ ఫొటోలు, అశ్లీల వీడియోలు!

Published Tue, Aug 31 2021 3:21 PM | Last Updated on Tue, Aug 31 2021 7:23 PM

Deepfake Face Swap Creates Big Headache To Indian Actresses - Sakshi

గ్లామర్​ ప్రపంచం​..  ఎక్కువ మందిని తనవైపు లాగే ఒక ఆకర్షణ. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో  వైరల్​ న్యూస్​ అవుతున్న రోజులివి.  ముఖ్యంగా ఫిమేల్​ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటోంది. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్​ అనేది ఫ్రీ ప్రమోషన్​ ఎలిమెంట్​. అందుకే తమ క్రేజ్​ను నిలబెట్టుకునేందుకు గ్లామర్​ ఫొటో‌-వీడియో కంటెంట్‌ను క్రమం తప్పకుండా షేర్‌ చేస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ  కంటెంట్​ తప్పుడు దోవలో వెళ్తోంది. ఆ కంటెంట్‌ను మార్ఫింగ్‌ చేసి ఇంటర్నెట్​నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలతో నింపేస్తున్నారు కొందరు. 

వెబ్‌ డెస్క్‌: ‘ఫేస్‌ మారిపోతది..  ఫన్‌ పుడుతది’.. ఈ ప్రచారంతోనే  ఎడిటింగ్​ యాప్స్‌ల హవా సాగుతోంది ఇప్పడు. కానీ, తెర వెనుక జరిగే తతంగం అంతా వేరే ఉంటోంది. సరదా కోణంలో చూసుకుంటున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్​ విపరీతంగా జనరేట్​ కావడానికి ఇవే ప్రధాన కారణం అవుతున్నాయి. రోజుకి సుమారు 40 లక్షల ఎడిటింగ్​ వీడియోలు, 3 కోట్లకు పైగా ‘ఫేక్’(ఎడిటింగ్​) కంటెంట్​ అప్​లోడ్​ అవుతున్నట్లు ఒక అంచనా. ​ఈ విషయంలో మామూలు వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. . దీంతో విదేశాల్లో ఈ వ్యవహారాన్ని సెలబ్రిటీలు అంత తేలికగా తీసుకోవడం లేదు. హాలీవుడ్‌లో అయితే ఇలాంటి అశ్లీల కంటెంట్‌ కట్టడి కోసం పెద్ద ఉద్యమమే నడుస్తోంది. 

వీళ్లంతా పోరాడుతున్నారు
మనదగ్గర దాదాపు పాతరం, కొత్త తారలంతా ఫేక్​ఎడిటింగ్‌ కంటెంట్​ బాధితులుగానే ఉన్నారు. అయితే తమను నెట్టింటికీడుస్తున్న  వ్యవహారాలపై పోరాడటానికి ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు సహించడం లేదు.  హాలీవుడ్‌ నటీమణులు  కేట్​ విన్స్​లెట్​, జెస్సికా ఆల్బాలు ఈ విషయంలో సైబర్ సంబంధిత విభాగాల్లో​ ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్​ మీడియాలో ఈ వ్యవహారంపై ఓపెన్​గా చర్చించారు. ఇక ‘వండర్​ వుమెన్​’ గాల్​ గడోట్​అయితే ఏకంగా అశ్లీల కంటెంట్​ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది.

నటి గాల్‌ గాడోట్‌

ఈజిప్ట్​ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్​ను సోషల్​ మీడియాలో స్క్రీన్​ షాట్స్​ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటన్​ భామలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా కట్టడికి వీలు లేనప్పుడు.. అలాంటి సైట్లను పూర్తిగా నిషేధించడం ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మన దగ్గరికి వస్తే బాలీవుడ్​, మాలీవుడ్​, కోలీవుడ్, టాలీవుడ్​​..భాషలకతీతంగా చాలామంది హీరోయిన్లు ఈ వ్యవహారంలో బాధితులుగా మారుతున్నారు. గూగుల్‌లో వాళ్ల కంటెంట్​ కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే..  ప్రముఖ సోషల్​ మీడియా యాప్స్​లోనూ  వందల కొద్ది అకౌంట్​ల ద్వారా అవి వైరల్ అవుతుండడం, వాటికి వేల నుంచి లక్షల మంది ఫాలోవర్స్​ ఉండడం.
 

వాళ్లే  బెటర్​
నాలుగు నెలల క్రితం కోలీవుడ్‌కు చెందిన ఓ నటి​.. ట్విటర్​లో హీరోయిన్ల ఫేక్​ ఫొటోల్ని షేర్​ చేస్తున్న ఓ అడల్ట్​ అకౌంట్​కు ఫాలో రిక్వెస్ట్​ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్​ షాట్​ను షేర్​ చేసి.. ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్​ చేశాడు ఆ అకౌంట్​ అడ్మిన్​.  వెంటనే సైబర్​ విభాగానికి ఫిర్యాదు చేసిన ఆ నటి..  అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది. తాజాగా భోజ్‌పురికి చెందిన ఇద్దరు హీరోయిన్లు తమ పేరుతో వైరల్‌ అవుతున్న కంటెంట్‌ మీద కోర్టుకు వెళ్లారు. ఇలా ఎంతోమంది చిన్నాచితకా హీరోయిన్లు అశ్లీల కంటెంట్‌ వ్యాప్తిపై ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. 

సాధారణంగా ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురైనప్పుడు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉంటుందని, అవసరం అనుకుంటే ఫిర్యాదుదారుడి సమాచారం సైతం గోప్యంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు న్యాయ నిపుణులు. 

సెక్షన్​ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్​చేయడం) 
354సీ (అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 
499 (వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం), 
509 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), 
వీటితో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్లు 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్ల ప్రకారం ఉపశమనం పొందొచ్చు.
 


ఫేస్ స్వాప్​

ఫొటో, వీడియో ఎడిటింగ్‌ యాప్‌లలో ఫిల్టర్‌లు, ఫొటో మార్ఫింగ్‌లు సాధారణమైన వ్యవహారాలు. కానీ, టెక్నాలజీ అప్‌డేట్​ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. ఫేస్​ స్వాప్​.. అశ్లీల టెక్నాలజీని పెంపొదిస్తున్న వాటిల్లో ఒకటిగా మారింది. ఒకరి ముఖం ప్లేస్‌లో మరొకరి ఫేస్‌ ఉంచడమే దీని ఉద్దేశం. మొదట్లో రివెంజ్​ పోర్న్​ ద్వారా వార్తల్లో నిలిచిన ఫేస్​ స్వాప్​.. ఆ తర్వాత ఓ ఎంటర్​టైనింగ్​ ఫీచర్​\టూల్​గా మారింది. ఇప్పుడు దీనిని ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్​ చేసి.. ఇంటర్నెట్​లో వదులుతున్నారు.
 

డీప్‌ఫేక్‌ ఫీచర్‌
ఇది ఒకరకంగా మార్ఫింగ్‌ లాంటిదే.  అల్రెడీ ఉన్న వీడియోతోగానీ,  అప్పటికప్పుడు చేసే వీడియోతో  ఫన్నీ కంటెంట్‌ క్రియేట్‌ చేసేందుకు ఉద్దేశించి రూపొందించిన ఫీచర్‌. అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ(ఏఐ)తో పని చేసే సింథటిక్‌ టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్‌ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్‌ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్‌డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్‌ చేసుకోవచ్చు.  ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి వీడియో ఎడిటింగ్‌ యాప్‌లు. కానీ, గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్న సెలబ్రిటీలకు.. ఫేక్​ వీడియోల ద్వారా ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పి తీసుకొస్తోంది.

కంట్రోల్​ కాదనేనా? 
గతంలో ఇలాంటి కంటెంట్‌ తెరపైకి వచ్చినప్పుడు.. ఖండించిన తారలూ లేకపోలేదు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కొందరు సరదా కోసం ఎడిటింగ్​ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే.. మరికొందరు సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అనని మాటల్ని అన్నట్లు.. చేయని పనుల్ని చేసినట్లు చూపిస్తున్నారు. కాంట్రవర్సీలు, ఫేక్‌ సెక్స్‌ స్కాండల్స్‌తో  ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ ‘సేఫ్టీ’పై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ‘ప్రీ ఎంప్టివ్‌ రీసెర్చ్‌’ సర్వీస్‌ ఉంది. ఈ సర్వీస్‌ ద్వారా  యూజర్‌ జనరేట్‌ కంటెంట్‌ను కంట్రోల్‌ చేయగలిగినా.. ఇతర సైట్లతో మళ్లీ వైరల్ అవ్వొచ్చని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వ్యవహారాలేవీ కొత్తేం కాదని, ఎంత నియంత్రించినా మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు నెదర్లాండ్స్ ఆర్ట్​ఈజెడ్​ యూనివర్సిటీ ‘ఎస్తెటిక్స్​ అండ్​ కల్చర్​ ఆఫ్​ టెక్నాలజీ’ ప్రొఫెసర్​ నిశాంత్​షా. బహుశా ఈ కోణంలోనే ఆ ఫేక్‌ బురదలో రాయి వేయడం ఎందుకని  ఈ తలనొప్పిని పంటి బిగువున భరిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది.

చదవండి: సెల్‌ఫోన్‌ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement