న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచ దేశాలన్నిటా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. గ్లోబల్ ఈవీ 2020 ఔట్‌లుక్ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2.1 మిలియన్లకు చేరాయి. వెరసి వీటి మొత్తం సంఖ్య 7.2 మిలియన్లను తాకాయి. దీంతో 2019లో యూరోప్ దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలపై 60 బిలియన్ యూరోలను ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. చైనాలో అత్యధికంగా 45 శాతం అంటే 2.3 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నట్లు అంచనా. తదుపరి యూఎస్ 12 శాతం, యూరప్ 11 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. 2030కల్లా మొత్తం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 14 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇవి ప్రపంచ వాహనాల సంఖ్యలో 7 శాతం వాటాకు సమానమని ఆటోరంగ నిపుణులు పేర్కొన్నారు.
జీసీసీ..
గల్ఫ్ ప్రాంతంలోని 6 అరబ్ దేశాలు 1981లో గల్ఫ్ దేశాల సహకార సమితి(జీసీసీ)ని ఏర్పాటు చేసుకున్నాయి. గల్ఫ్ దేశాలుగా పిలిచే జీసీసీలో బెహ్రయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల జీడీపీ 2018 అంచనాల ప్రకారం 3.655 ట్రిలియన్ డాలర్లు. ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం ఆరు దేశాల గల్ఫ్ దేశాల సహకార కూటమి(జీసీసీ) ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదో వంతు వాటాను కలిగి ఉంది. ప్రపంచ చమురు ఎగుమతుల్లో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ అంచనాల ప్రకారం 2035 కల్లా చమురు డిమాండ్ గరిష్టానికి చేరుతుందని ఐపీవో ప్రణాళికల్లో భాగంగా గతంలో సౌదీ అరామ్‌కో పేర్కొంది. కాగా.. గ్లోబల్ ఆయిల్ డిమాండ్ 2041కల్లా గరిష్టానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. 1.15 కోట్ల బ్యారళ్లకు చేరవచ్చని పేర్కొంది. ఆపై డిమాండ్ క్షీణ పథం పట్టవచ్చని పరిశ్రమ నిపుణుల ద్వారా అంచనా వేసినట్లు తెలియజేసింది. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ ప్రధాన చమురు ఉత్పత్తిదారులుగా నిలుస్తున్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో జీసీసీ వాటా 30 శాతంకాగా.. సౌదీ అరేబియా 15.7 శాతం, కువైట్ 6 శాతం, యూఏఈ 5.8 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి.
ప్రభావం తక్కువే
ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో చమురుపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రస్తుతం వేగం ఆధారంగా రానున్నదశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా వీటి వాటా 7 శాతానికి చేరవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. దీంతో ముడిచమురు, గ్యాస్ విక్రయాలపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాలకు సమీప భవిష్యత్‌లో భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా చమురు ధరలు సగటున 40-60 డాలర్ల మధ్య కదులుతున్నట్లు తెలియజేశాయి. దీంతో కొంతకాలంగా పలు చమురు ఉత్పాదక దేశాలు రియల్టీ, టూరిజం తదితర చమురేతర ఆదాయాలపై దృష్టి పెడుతున్నట్లు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment