వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో కుప్పకూలిన మార్కెట్లు పుంజుకుంటాయా లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధర పెరుగుతుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్‌పై ఎలా ఉండబోతాయని వివరాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు.
దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ భయాలు ఉన్నా.. ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల జోక్యం చేసుకోనంత వరకు మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉండదు. యుద్ధానికి సంబంధించి వేరే దేశాలు నిర్ణయాలు తీసుకున్నా, వాటి విధానాలు మార్చుకున్నా మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి.
రూపాయితో పోలిస్తే డాలర్ ఇంకా బలపడుతుంది. దాంతో ఆర్‌బీఐ ఫారెక్స్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి ఇంకా పడిపోకుండా చేసే వీలుంది. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం పొంచిఉంటుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి.
ఇటీవల ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల ద్వారా అమెరికాలో రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంది. అయితే కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
గతవారం మార్కెట్లు పతనం తర్వాత ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న జోన్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది నిత్యం మారుతూ ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థను మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దాంతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment