సాక్షి,ముంబై: తైవాన్ కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ ఇండియాలో కొత్త పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చింది. తమ ఛైర్మన్ ఇండియాను సందర్శించి నప్పటికీ దేశంలోఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల తయారీలో అగ్రగామి ఫాక్స్‌కాన్ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సంస్థ శనివారం తోసిపుచ్చింది. దీంతో ఇకపై తక్కువ ధరకే మేడిన్ ఇండియా ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లైంది.
కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్లో ఐఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ విషయంలో మీడియా వచ్చినట్టుగా చర్చలు,అంతర్గత సమీక్షలు, భారీ పెట్టుబడులు అనేది ఫాక్స్‌కాన్ అందించిన సమాచారం కాదని తేల్చి పారేసింది.
అయితే భారీ పెట్టుబడి కోసం ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు.యంగ్ లియుతో వివరణాత్మక చర్చల తర్వాత రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిందనీ, ఇది 1 లక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల భూమి కేటాయించినట్టుగా కూడా బొమ్మై ట్వీట్ చేశారు. దీంతోపాటు లక్షమందికి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు.
కాగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల (మార్చి) 4 వరకు ఇండియాలో పర్యటించారు. సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించిందని అధికారికంగానే ప్రకటించారు. అలాగే కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో సంబంధాలను కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment