న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. తాజాగా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది.
తొలుత గోఫస్ట్ ముంబై-లేహ్ విమానంలో ఇంజన్ నంబర్ 2లో లోపం కనిపించడంతో గమనించిన సిబ్బంది ఢిల్లీకి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. ఆ తరువాత మరో విమానం గాల్లో ఉండగానే సమస్య ఏర్పడింది. శ్రీనగర్-ఢిల్లీ విమానం నంబర్- 2 ఇంజన్‌లో లోపాన్ని గుర్తించడంతో దీన్ని తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులు,న సిబ్బంది క్షేమంగా ఉండటం భారీ ఉపశమనం కలిగించింది. దీనిపై విచారణ జరుగుతోందని, డీజీసీఏ క్లియరెన్స్ వచ్చిన తరువాతే విమానాలు తిరిగి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు.
కాగా దేశీయ విమానాల్లో వరుస లోపాల నేపథ్యంలో విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా పర్యవేక్షణ నిమిత్తం విమానయాన సంస్థలు, ఇతర మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో పలు సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment