
బంగారం, వెండి ధరలు పతనం
ముంబై : కొండెక్కిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పడిపోయాయి. గతవారం బండారం ధరలు రికార్డు స్ధాయిలో 56,000 రూపాయలకు చేరినప్పటి నుంచి పసిడి ఒడిదుడుకులతో సాగుతోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు ఈరోజూ దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 415 రూపాయలు పతనమై 52,515 రూపాయలకు తగ్గింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలూ దిగివచ్చాయి.
కిలో వెండి ఏకంగా 2377 రూపాయలు తగ్గి 68,700 రూపాయలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1952 డాలర్లకు దిగివచ్చింది. ఈ వారం బంగారం ధరలు 4 శాతం మేర తగ్గాయి. కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను నమోదు చేశామని రష్యా ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక మరికొద్ది రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్, ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌లతో ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటికే 30 శాతం పెరగడం గమనార్హం. చదవండి : బంగారం కొండ దిగుతోంది