Gold Demand In India 2021: Demand Rises 37% To 140% | కరోనా కాలంలో పసిడికి భారీగా డిమాండ్‌ - Sakshi
Sakshi News home page

కరోనా కాలంలో పసిడికి భారీగా డిమాండ్‌

Published Fri, Apr 30 2021 2:14 PM | Last Updated on Fri, Apr 30 2021 4:37 PM

Gold demand rises 37 percent to 140 tonne in Jan-March 2021 - Sakshi

ముంబై: భారత్‌ బంగారం డిమాండ్‌ 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 37 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి)పెరిగింది. పరిమాణంలో ఇది 140 టన్నులు. కోవిడ్‌ సంబంధ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, అంతర్జాతీయంగా ధరలు దిగిరావడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. 2020 మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్‌ 102 టన్నులు. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) గురువారం ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. 

  • విలువ రూపంలో చూస్తే, బంగారం డిమాండ్‌ 57 శాతం పెరిగి, రూ.37,580 కోట్ల నుంచి రూ.58,800 కోట్లకు చేరింది. 
  • ఆభరణాల డిమాండ్‌ 39 శాతం పెరిగింది. పరిమాణంలో ఇది 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 58 శాతం పెరిగి రూ.27,230 కోట్ల నుంచి రూ.43,100 కోట్లకు చేరింది. 
  • పెట్టుబడుల డిమాండ్‌ 34 శాతం పెరిగింది. పరిమాణంలో 28.1 టన్నుల నుంచి 37.5 టన్నులకు పెరిగింది. విలువలో 53 శాతం ఎగసి రూ.10,350 కోట్ల నుంచి రూ.15,780 కోట్లకు ఎగసింది. 
  • ఇక గోల్డ్‌ రీసైక్లింగ్‌ 20 శాతం పడిపోయింది. పరిమాణంలో 18.5 టన్నుల నుంచి 14.8 టన్నులకు చేరింది. 
  • మొదటి త్రైమాసికంలో నికర దిగుమతులు భారీగా 262 శాతం పెరిగి 83.1 టన్నుల నుంచి 301 టన్నులకు చేరాయి. 
  • కడ్డీలు, నాణేల డిమాండ్‌ భారీగా 34 శాతం పెరిగింది. 2015 తర్వాత ఈ స్థాయి పటిష్ట డిమాండ్‌ ఇదే తొలిసారి.

అంతర్జాతీయంగా 23 శాతం పతనం
కాగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ మార్చి త్రైమాసికంలో 23% పడిపోయింది. 2020 ఇదే కాలంతో పోల్చిచూస్తే పరిమాణం 1,059.9 టన్నుల నుంచి 815.7 టన్నులకు దిగింది. పసిడి ఈటీఎఫ్‌ నుంచి నిధులు బయటకు వెళ్లడం, వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు కొనుగోళ్లు అంతంతమాత్రంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. పెట్టుబడుల డిమాండ్‌ 71 శాతం పడిపోయి, 549.6 టన్నుల నుంచి 161.6 టన్నులకు దిగింది. సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు 124.1 టన్నుల నుంచి 95 టన్నులకు తగ్గింది. కాగా ఆర్‌బీఐ కొనుగోళ్లు  18 టన్నుల నుంచి 18.7 టన్నులకు ఎగశాయి.  

నడుస్తున్న త్రైమాసికం కష్టమే...
ధర తగ్గడం, కోవిడ్‌ ఆంక్షల సడలింపుతోపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావడం మార్చి త్రైమాసికంలో పసిడి సెంటిమెంట్‌ను సానుకూలమైంది. వార్షికంగా చూస్తే, త్రైమాసికంలో సగటున 10 గ్రాముల పసిడి ధర 14 శాతం పెరిగి రూ.47,131గా ఉంది. అయితే సమీక్షా కాలానికి ముందు త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌) ధర 6 శాతం తగ్గింది. ధర గరిష్ట స్థాయిల్లో రూ.56,000 వద్ద ఉన్న ఆగస్టు 2020తో పోలి్చతే ధరల్లో తగ్గుదల ఏకంగా 16 శాతంగా ఉంది. రూ.50,000 దిగువకు పసిడి దిగిరావడంతో కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు సంసిద్ధత సానుకూలంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల వంటి కార్యక్రమాలు డిమాండ్‌కు తోడయ్యాయి. 

ఇక పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్‌ మెరుగుపడ్డం ఇది వరుసగా మూడవ త్రైమాసికం. పసిడిపై సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేతం కావడం పసిడికి సానుకూల అంశాలుగా మారాయి. అయితే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఇంత మంచి ఫలితాలు ఉంటాయన్న విషయం అనుమానమే. కోవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ పెరుగుదల, రాష్ట్రాల్లో స్థానికంగా లాక్‌డౌన్లు, వినియోగ డిమాండ్‌ పడిపోవడం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా అంశాల నేపథ్యంలో పెళ్లిళ్లకు బంగారం డిమాండ్‌ పడిపోయే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విస్తృతం అయ్యేంత వరకూ డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగే వీలుంది. ఆయా పరిస్థితుల్లో 2021 సంవత్సరం మొత్తంగా డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశం చెప్పడం కష్టమే. 

- పీఆర్‌ సోమసుందరం, డబ్ల్యూజీసీ మేనేజింగ్‌ డైరెక్టర్, ఇండియా

చదవండి:

సామాన్యులకు ఊరట.. జీఎస్‌టీ తొలగింపు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement