న్యూఢిల్లీ: భారత్‌లో బంగారం రిఫైనరీ యూనిట్ల ఏర్పాటుకు ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ’ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) చైర్‌పర్సన్ కె.రాజారామన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో బంగారం కొనుగోలుకు భారత్ అతిపెద్ద దేశంగా ఉన్నట్టు చెప్పారు.
‘‘అతిపెద్ద కొనుగోలు దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనరీ ప్లాంట్ల ఏర్పాటుకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. రిఫైనరీ (శుద్ధి) కోసం ఏటా 250 టన్నుల ఓర్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోనూ రిఫైనరీ ప్రారంభించొచ్చు. ఇందుకోసం పన్ను విధానాలు లేదా కస్టమ్స్ టారిఫ్‌లలో కొన్ని మార్పులు అవసరం. కనుక గిఫ్ట్ సిటీలో రిఫైనింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి’’అని పేర్కొన్నారు.
ఇండియన్ గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ)తో కలసి ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన బంగారం సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజారామన్ మాట్లాడారు. మన దేశం ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండగా... ఇందులో అధిక భాగం ఆభరణాలకే వినియోగమవుతోంది.
మెరుగ్గా వినియోగించుకోవాలి..
బంగారంపై రుణాలు, లీజింగ్ ఎకోసిస్టమ్‌పై ఆర్‌బీఐతో కలసి పనిచేస్తున్నట్టు రాజారామన్ తెలిపారు. బంగారం కీలక సాధనం కావడంతో దీనికి ఇండెక్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘సామాన్యుల కప్‌బోర్డులలో బంగారం నిల్వ ఉంటోంది. ఆర్‌బీఐ ఖజానాలోనూ 800 టన్నులు ఉంది. ఆర్థిక వ్యవస్థ చలామణిలోకి ఇది రావడం లేదు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం దీన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరం’’అని పేర్కొన్నారు. అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారత్‌కు చక్కని డెలివరీ ప్రమాణాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. బంగారం మార్కెట్‌లో గిఫ్ట్ సిటీ పాత్ర మరింత మెరుగుపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment