న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు ముడిచమురు ధరలకు జోష్‌నిస్తున్నాయి. మరోపక్క బంగారం, వెండి ధరలు బలహీనపడుతున్నాయి. థాంక్స్ గివింగ్ డే సందర్భంగా నేడు యూఎస్ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం అటు చమురు, ఇటు బంగారం ధరలు లాభపడ్డాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగుతున్న బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టాలకు చేరగా.. చమురు ధరలు మార్చి గరిష్టాలను తాకాయి. ఇతర వివరాలు చూద్దాం..
లాభాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 161 లాభపడి రూ. 48,674 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి కేజీ రూ. 298 పుంజుకుని రూ. 60,141 వద్ద కదులుతోంది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు. కాగా.. ఎంసీఎక్స్‌లో పసిడికి రూ. 48,400- 48,220 వద్ద సపోర్ట్స్ లభించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ డైరెక్టర్ మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదేవిధంగా రూ. 48,660- 48,850 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పేర్కొన్నారు.
బలపడ్డాయ్..
న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.22 శాతం బలపడి 1,815 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,808 డాలర్లకు చేరింది. వెండి సైతం 0.2 శాతం పెరిగి ఔన్స్ 23.50 డాలర్ల వద్ద నిలిచింది. కాగా.. కామెక్స్‌లో ఔన్స్ పసిడికి 1792- 1784 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా 1814-1822 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు.
చమురు జోరు
న్యూయార్క్ మార్కెట్లో బుధవారం నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం పుంజుకుని 45.92 డాలర్లను తాకింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.6 శాతం ఎగసి 48.61 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి గరిష్టాలను తాకాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే రెండు రోజులుగా ధరలను సవరించకపోవడం గమనార్హం! విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment