
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల మొత్తం లావాదేవీల్లో థర్డ్ పార్టీ యూపీఐ సంస్థల (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ తదితర) వాటా ఒక్కోటీ 30 శాతం మించకూడదన్న నిబంధన అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వాయిదా వేసింది. దీంతో 2024 డిసెంబర్ చివరి వరకు అదనపు సమయం లభించినట్టయింది.
ఈ నిర్ణయం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో 30 శాతానికి పైగా వాటా కలిగిన ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ఊరటనివ్వనుంది. యూపీఐ నిర్వహణను ఎన్‌పీసీఐ చూస్తుంటుంది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తుండడం తెలిసిందే. ఒక్క థర్డ్ పార్టీ యాప్ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్‌లో ఎన్‌పీసీఐ తీసుకొచ్చింది.ఈ నిర్ణయం వాస్తవానికి అయితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి. అయితే 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్‌లు అయిన గూగుల్, ఫోన్‌పే సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్‌పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది.
‘‘యూపీఐ ప్రస్తుత వినియోగం, భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. నిర్ధేశిత పరిమితికి మించి (30 శాతానికి పైగా) లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్ సంస్థలకు నిబంధనల అమలుకు ఇచ్చిన రెండేళ్ల అదనపు గడువును, 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించాం’’అని ఎన్‌పీసీఐ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ఉన్న భారీ అవకాశాల దృష్ట్యా బ్యాంకులు, నాన్ బ్యాంకులు సైతం ఈ విభాగంలో మరింత వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే వాటా సుమారు 46 శాతం, గూగుల్‌పే వాటా 33 శాతంగా, పేటీఎం వాటా 11 శాతం మేర ఉంది.
చదవండి: 17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్ మస్క్‌తో కలిసి