Covid Vaccine Online Sale: కరోనా వ్యాక్సిన్‌ ఆన్‌లైన్‌లో దొరకనుందా..! - Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌ ఆన్‌లైన్‌లో దొరకనుందా..!

Published Fri, Apr 30 2021 12:04 AM | Last Updated on Fri, Apr 30 2021 11:38 AM

Healthcare Aggregators In Bringing Corona Vaccines Closer - Sakshi

దేశ ప్రజలకు కరోనా టీకాలను చేరువ చేయడంలో హెల్త్‌ అగ్రిగేటర్లు (ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌/ఫార్మసీ సంస్థలు) కూడా పాలుపంచుకోనున్నారు. 1ఎంజీ, ఫార్మ్‌ఈజీ, మెడిబుడ్డి తదితర సంస్థలు ఇప్పటికే టీకాల తయారీ సంస్థలతో చర్చలు కూడా మొదలు పెట్టాయి. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో టీకాలను దేశంలోని నలుమూలలకూ వేగంగా సరఫరా చేయడంతోపాటు తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు హెల్త్‌ అగ్రిగేటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు.

అదే విధంగా ప్రభుత్వ టీకాల టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ కోవిన్‌తో అనుసంధానం కావడం ద్వారా ప్రతీ టీకా నమోదు చేయడంలో భాగస్వామ్యం అవ్వాలని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కోవిన్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌లు అనుసంధానం కావడం వల్ల పెద్ద ఎత్తున వైద్యులు, క్లినిక్‌లు, ఆరోగ్య సిబ్బందితో నెట్‌వర్క్‌ భారీగా విస్తృతం అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల ప్రభుత్వ, 7 వేల ప్రైవేటు కేంద్రాల్లోనే టీకాలను వేస్తుండగా.. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకాలను వేగంగా ఇవ్వాలంటే ఈ నెట్‌వర్క్‌ చాలదు. హెల్త్‌కేర్‌ అగ్రిగేటర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తే నెట్‌వర్క్‌ విస్తృతం కావడం ద్వారా మరింత మందికి టీకాలను చేరువ చేసే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

కీలక పాత్ర..: ‘‘ప్రస్తుతం టీకాలను ఇచ్చే కార్యక్రమం పరిమితంగానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రులపై ఇప్పటికే ఎంతో భారం నెలకొంది. కనుక ఈ విషయంలో మా వంటి నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు పెద్ద పాత్ర పోషించవచ్చు’’ అని 1ఎంజీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ టాండన్‌ పేర్కొన్నారు. ప్రజలు తమ వంటి పోర్టళ్లలో పేర్లను నమోదు చేసుకుంటే.. వారికి సమీపంలో టీకాలను ఇచ్చే క్లినిక్‌ లేదా ల్యాబ్‌ విషయమై సూచనలు చేయడానికి వీలుంటుందన్నారు. 1ఎంజీ ఆన్‌లైన్‌ ఫార్మసీ, ల్యాబ్‌ తదితర సేవలను ఆఫర్‌ చేస్తోంది. ఈ సంస్థకు 1.5 కోట్ల కస్టమర్లు ఉన్నారు. కార్పొరేట్‌ సంస్థలు, పెద్ద హౌసింగ్‌ సొసైటీల్లో టీకాల క్యాంపులను ఏర్పాటు చేసేందుకు 1ఎంజీ ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించింది. ‘‘కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రత దృష్ట్యా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి సుముఖత చూపకపోవచ్చు. లేదా కొందరు బయటకు రాలేని పరిస్థితి ఉండొచ్చు. కనుక అటువంటి వారి ఇంటికే నేరుగా వెళ్లి టీకాలిచ్చేందుకు మేము ఆసక్తిగా ఉన్నాము. కాకపోతే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది’’అని ప్రశాంత్‌ టాండన్‌ వివరించారు. 

నేరుగా టీకాలు ఇచ్చేందుకు సుముఖం.. 
భారీ ఆస్పత్రుల చైన్‌లతోపాటు ఆరోగ్య సంరక్షణ సంస్థలు సైతం కో విన్‌ ప్లాట్‌ఫామ్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా 30 పట్టణాల పరిధిలో మాకు కోల్డ్‌ చైన్‌ నెట్‌వర్క్‌ (శీతలీకరించిన నిల్వ, సరఫరా నెట్‌వర్క్‌) ఉంది. మా సిబ్బందికి టీకాలు ఇవ్వడంపై శిక్షణ కూడా ఇచ్చాం. టీకాలను నేరుగా కొనుగోలు చేసి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము’’ అని హోమ్‌ హెల్త్‌కేర్‌ సేవల సంస్థ పోర్టియా మెడికల్‌ సీఈవో మీనా గణేష్‌ తెలిపారు. ఫ్లూ వ్యాక్సిన్‌ల దేశవ్యాప్త సరఫరా అనుభవం తమకు ఉందన్నారు. టీకాల సరఫరాదారులతో ఈ సంస్థ ఇప్పటికే చర్చలు కూడా నిర్వహిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement