పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ధరించే హవాయి చెప్పులు జీఎస్టీ దెబ్బకు కనుమరుగవుతున్నాయి. పెరిగిన జీఎస్టీతో వందలాది తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. జీఎస్టీ పెంపు కారణంగా దాదాపు 325 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు మూతపడ్డాయని జలంధర్ రబ్బర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది.
ఏడేళ్ల క్రితం ఒక్క జలంధర్‌లోనే 400 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలుగా ఉండేవి. జీఎస్టీని పెంచడం, అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వీటిలో దాదాపు 325 యూనిట్లు మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంటోంది.
జీఎస్టీ పెంపే కారణం
హవాయి చెప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడమే యూనిట్ల మూసివేతకు కారణమని ఆయా పారిశ్రమల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జలంధర్ రబ్బర్ గూడ్స్ తయారీదారుల సంఘం కార్యదర్శి రాకేష్ బెహల్ మాట్లాడుతూ.. ‘2017 జూలై 1న జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న పాదరక్షలు, వస్త్రాలను 5 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు. ఆ తరువాత జీఎస్టీ 7 శాతం పెంచి 12 శాతం శ్లాబ్ కిందకు చేర్చారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా హవాయి చప్పల డిమాండ్, సరఫరాపై తీవ్రంగా పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై వ్యాట్ రేటు చాలా రాష్ట్రాల్లో సున్నా లేదా కొన్ని రాష్ట్రాల్లో 0.5 శాతం ఉండేది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ధరించే తక్కువ ధర హవాయి చప్పలపై 12 శాతం జీఎస్టీ అస్సలు సమర్థనీయం కాదని, వెంటిలేటర్‌పై ఉన్న హవాయి చెప్పుల పరిశ్రమను బతికించాలని పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Comments
Please login to add a commentAdd a comment