నేను 2019లో పన్ను ఆదా కోసం ఎన్‌పీఎస్ సాధనంలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉపసంహరించుకోవాలి? – కల్పేష్ వర్మ
ఎన్‌పీఎస్ టైర్–1 పెట్టుబడులకు 60 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ ఉంటుంది. ఈ లోపే ఎన్‌పీఎస్ నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోవాలంటే, అందుకు కొన్ని షరతులు వరిస్తాయి. ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఎన్‌పీఎస్ నిధి నుంచి కేవలం 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అది కూడా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావాలి.
మీరు 2019లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మూడేళ్ల కాలం పూర్తయింది. కనుక సమకూరిన నిధి నుంచి 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్‌పీఎస్ ఖాతాను శాశ్వతంగా మూసివేయదలిస్తే, ఆరంభించి పదేళ్లు ముగిసిన తర్వాతే అది సాధ్యపడుతుంది. పదేళ్లలో ఏర్పడిన నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో నెలవారీ పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్‌పీఎస్ ఖాతాలో పదేళ్ల తర్వాత కూడా మొత్తం నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే, అప్పుడు నూరు శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
ఎన్‌పీఎస్ నుంచి వైదొలిగేందుకు సీఆర్‌ఏ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఉపసంహరణకు కారణాన్ని పేర్కొనాలి. బ్యాంక్ అకౌంట్, కాంటాక్ట్ వివరాలను ధ్రువీకరించాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పటి నుంచి ఐదు పనిదినాల్లో మీ ఉపసంహరణ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది.
ఇతర మార్గాలు లేకపోతే తప్ప, ముందస్తు ఉపసంహరణను ఎంపిక చేసుకోవద్దన్నదే మా సలహా. విశ్రాంత జీవనం కోసం ఉద్దేశించిన నిధిని ఉపసంహరించుకోకుండా నిరాశ పరచడమే ఈ పథకంలోని షరతుల ఉద్దేశ్యం. ఎన్‌పీఎస్ పెట్టుబడుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు సహేతుకమేనని చెప్పుకోవాలి.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
Comments
Please login to add a commentAdd a comment