![IIT Researchers Develop Marine Robot - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/5/marine.jpg.webp?itok=-VvjO72h)
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువవుతోంది. దాదాపు అన్నింట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని చోటుకు, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు.
సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు.
సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది.
ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్
ఉపయోగాలివే..
మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment