జీవిత బీమా పాలసీకి ఈ నాలుగూ ఎంతో కీలకం | Important Aspects In Insurance | Sakshi
Sakshi News home page

జీవిత బీమా పాలసీకి ఈ నాలుగూ ఎంతో కీలకం

Published Mon, Nov 15 2021 10:59 AM | Last Updated on Mon, Nov 15 2021 11:40 AM

Important Aspects In Insurance - Sakshi

ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమాది కీలకపాత్ర. ఇతర ఆర్థిక సాధనాలు, పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు దీనికి ప్రాధాన్యమివ్వాలి. కరోనా వైరస్‌ మహమ్మారిపరంగా ఏదైనా మంచి జరిగిందంటే.. అది చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా ప్రాధాన్యతలను గుర్తించడమే. వైవిధ్యభరితమైన ఆర్థిక సాధనంగా.. జీవితంలో వివిధ దశల్లో లక్ష్యాలను సాధించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎంతగానో అక్కరకొస్తుంది. జీవిత బీమా పాలసీలను ఆన్‌లైన్‌లో కూడా సులభతరంగా కొనుగోలు చేయడానికి వీలున్న ప్రస్తుత తరుణంలో.. పాలసీ ఎంపికలో గుర్తుంచుకోతగిన అంశాలు నాలుగు ఉన్నాయి. అవేంటంటే.. 
అంచనా వేసుకోవడం
మీ జీవితంలో ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆకాంక్షలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉండవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు కావచ్చు.. రుణాలను తీర్చివేసేందుకు లోన్‌ తీసుకోవడం కావచ్చు, వైద్య చికిత్స ఖర్చులు.. రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు.. అవసరాలు అనేకం ఉండవచ్చు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు, మీ మీద ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితంగా కాపాడేందుకు వీలుగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కావాలనుకుంటే టర్మ్‌ పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. అలాగే యులిప్‌ (యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌)లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమానుగత ఆదాయం కోసం రిటైర్మెంట్‌ ప్లాన్‌ తీసుకోవడం వంటివి పరిశీలించవచ్చు. 
అధ్యయనం చేయడం
నిర్దిష్ట ప్లాన్‌ను ఎంచుకునే ముందు మార్కెట్లో ఉన్న వివిధ పథకాలను అధ్యయనం చేయండి. పాలసీ రకాలు, అవి అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి. ఉదాహరణకు టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడేది కాగా.. పిల్లల భవిష్యత్తును భద్రపర్చేదిగా చైల్డ్‌ ప్లాన్‌ పనికి వస్తుంది. ఇక ఎండోమెంట్‌ పాలసీ తీసుకుంటే ఇటు జీవిత బీమా, అటు పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.  
ఎంత కవరేజీ
సరైన పథకం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. తగినంత స్థాయిలో సమ్‌ అష్యూర్డ్‌ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలసీదారు ఆర్థిక స్థితిగతులు బట్టి కవరేజీని లెక్కించడానికి వీలవుతుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, తీర్చాల్సిన రుణాలు, జీవితంలో వివిధ దశలకు సంబంధించి ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సమ్‌ అష్యూర్డ్‌ ఎంతకు తీసుకోవాలన్న దానికి ప్రామాణికమైన అంకె ఏమీ లేదు. కానీ వార్షిక జీతానికి కనీసం 15 రెట్లు అయినా ఎక్కువగా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.  
పాలసీ ల్యాప్స్‌ కానివ్వొద్దు
టర్మ్‌ పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లింపులను కొనసాగించాలి. ల్యాప్స్‌ కానివ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పాలసీ ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి.  ఇలాంటి ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకుంటే, పాలసీ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి.. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఆర్థికమైన భరోసా లభించగలదు. 


- సంజయ్‌ తివారి, డైరెక్టర్‌ (స్ట్రాటజీ), ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

చదవండి:జీవిత బీమా ‘క్లెయిమ్‌’ చేయాల్సి వస్తే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement