
బెంగళూరు: దేశంలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఆజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటిస్తున్నాయి. తాజాగా నమ్మ మెట్రో రైలు కార్పోరేషన్ రాయితీలను ప్రకటించింది. లాల్‌బాగ్‌లో జరుగుతున్న ఫ్లవర్‌షో ప్రదర్శనకు 13 నుంచి 15 వరకు సందర్శకుల సౌకర్యార్థం బెంగళూరు మెట్రో రైలు మండలి రాయితీ టికెట్ వ్యవస్థ కల్పించింది.
శనివారం నుంచి సోమవారం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు లాల్‌బాగ్ మెట్రో స్టేషన్ నుంచి నగరంలో ఏ మెట్రోస్టేషన్‌కు ప్రయాణించాలంటే టికెట్ ధర రూ.30 నిర్ణయించింది. దీనికోసం పేపర్ టికెట్ పరిచయం చేసింది. ఈ మూడురోజుల పాటు లాల్‌బాగ్ నుంచి ఏ మెట్రోస్టేషన్‌కైనా ప్రయాణించవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మెట్రోస్టేషన్లలో పేపర్‌టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. లాల్‌బాగ్ మెట్రోస్టేషన్‌లో పేపర్ టికెట్ రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంటాయని మెట్రోమండలి తెలిపింది.