దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం! | India first regional train service RAPIDX to start soon | Sakshi
Sakshi News home page

దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!

Published Mon, Jul 3 2023 6:37 PM | Last Updated on Mon, Jul 3 2023 6:38 PM

India first regional train service RAPIDX to start soon - Sakshi

దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు రాపిడ్‌ఎక్స్‌ (RAPIDX) ఈ నెల (జూలై)లోనే ప్రారంభం కానుంది. 17 కిలో మీటర్ల పొడవుతో ఏర్పాటైన ఈ రైలు సర్వీసులో సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దార్‌, దుహాయ్‌ డిపో అనే స్టేషన్లు ఉంటాయని ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. ఈ అన్ని స్టేషన్లు పనులన్నీ పూర్తయి కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్‌ అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. 

దీంతోపాటు సాహిబాబాద్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు 42 కిలోమీటర్ల రైలు సర్వీస్‌ కూడా పూర్తయింది. దుహాయ్‌ డిపో తర్వాత 25 కి.మీ సెక్షన్‌ను ప్రాధాన్యతా విభాగం తర్వాత ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సెక్షన్‌లో మురదానగర్‌, మోదీ నగర్‌ సౌత్‌, మోదీ నగర్‌ నార్త్‌, మీరట్‌ సౌత్‌ స్టేషన్లు ఉంటాయి. ఈ సెక్షన్‌లు ఢిల్లీ - మీరల్‌ రీజనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌)లో భాగం. ఇందులో రైళ్లు 160 కి.మీ వేగంతో నడిచే అవకాశం ఉంది. 

2025 నాటికి 82 కిలో మీటర్లు
ఆర్‌ఆర్‌టీఎస్‌ నిర్మాణం 2019 జూన్‌లో ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌టీస్‌ కారిడార్‌ను నిర్మిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 2025 నాటికి మొత్తం 82 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.  రూ. 30,274 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌టీస్‌ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్‌ను ఎన్‌సీఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్రం ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ.  మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రతి రాపిడ్‌ఎక్స్‌ రైలులో ప్రీమియం కోచ్ తర్వాత మహిళలకు ఒక ప్రత్యేక కోచ్‌ ఉంటుంది. రిజర్వ్‌డ్‌ కోచ్‌లో 72 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ప్రతి స్టేషన్‌లోనూ డైపర్ మార్చేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement