బెంగళూరు: దేశీ ఐటీ రంగం వృద్ధి బాటలో దూసుకెడుతున్న నేపథ్యంలో భారత్ రాబోయే కొన్నేళ్లలో సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్‌లకు (సాస్) హబ్‌గా ఎదగనుంది. ఇందుకు భారీ కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలు ఊతంగా నిలవనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన ’ఇండియా: తదుపరి అంతర్జాతీయ సాస్ రాజధాని’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
50 పైచిలుకు సాస్ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే దేశీయంగా వివిధ విభాగాల్లో 100కు పైగా యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ఉన్నాయని నివేదిక పేర్కొంది. సాస్ స్టార్టప్‌లకు హబ్‌గా భారత్ అత్యంత వేగంగా ఎదుగుతోందని నివేదిక తెలిపింది.
ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రతిభావంతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని 80 శాతం మంది సాస్ ప్రమోటర్లు అభిప్రాయపడ్డారు. కస్టమర్లను పెంచుకునేందుకు సాస్ ప్రోడక్టులపై మరింతగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది తెలిపారు.
సాస్ సేవలు అందించే సంస్థలు కొత్త క్లయింట్లను దక్కించుకోవడంపైన, వివిధ ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ప్రస్తుత కస్టమర్లు జారిపోకుండా అట్టే పెట్టుకోవడంపైనా మరింతగా దృష్టి పెడుతున్నాయి. మార్కెట్ వ్యూహం విషయంలో పేరొందిన క్లయింట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక విభాగాలను లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు ..
► ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో సాస్ స్టార్టప్‌లలోకి వచ్చిన నిధులు .. గతేడాది మొత్తం మీద వచ్చిన నిధుల పరిమాణాన్ని దాటేశాయి.
►దేశీయంగా వినియోగదారుల ఆధారిత సా స్ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.
► 2025 నాటికి భారత్‌లో సాస్ మార్కెట్ అనేక రెట్లు పెరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ సాస్ మార్కెట్లో భారత్ వాటా 2 నుంచి 4 శాతంగా ఉండగా.. ఇది ఏడు నుంచి 10% వరకూ పెరగనుంది.
► దేశీయంగా 2018లో ఒకే ఒక సాస్ యూనికార్న్ ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 18కి చేరింది. అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సాస్ వ్యవస్థగా భారత్ మూడో స్థానంలో ఉంది.
►2019తో పోలిస్తే 2021లో దేశీయంగా సాస్ కంపెనీల సంఖ్య రెట్టింపయ్యింది. పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి ఆరు బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment