న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ఏదైనా కొత్త సినిమా, వెబ్‌సిరీస్ చూడాలన్నా ఇప్పుడు టీవీలకు బదులుగా మొబైల్, ల్యాప్‌టాప్‌లనే వాడుతున్నారు. అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నా క్రమంగా వాటి వాడకం తగ్గుతోంది. ఓటీటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు సంబంధించి మీడియా పార్ట్‌నర్స్ ఏషియా ఆసక్తికర నివేదిక విడుదల చేసింది.
ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) 2028 నాటికి అత్యధికంగా ఆదాయం నమోదయ్యే టాప్ 6 వీడియో మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఎదగనుంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు కూడా ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత వీడియో పరిశ్రమలో ఈ ఆరు దేశాల వాటా ఏకంగా 90 శాతంగా ఉండనుంది. మీడియా పార్ట్‌నర్స్ ఏషియా (ఎంపీఏ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఇక 2023–28 మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగే వీడియో మార్కెట్లలో ఒకటిగా భారత్ ఉంటుందని నివేదిక పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. 14 మార్కెట్లలో ఉచిత టీవీ చానళ్లు, పే–టీవీలు, వివిధ రకాల వీవోడీలు (వీడియో–ఆన్–డిమాండ్) .. వాటి వినియోగదారులు, ప్రకటనలు మొదలైన అంశాలను అధ్యయనం చేసిన మీదట ఎంపీఏ ఈ నివేదికను రూపొందించింది.
దీని ప్రకారం 2023–28 మధ్య కాలంలో ఏపీఏసీ వీడియో పరిశ్రమ మొత్తం ఆదాయం 2.6 శాతం వార్షిక వృద్ధితో 165 బిలియన్ డాలర్లకు చేరనుంది. చైనా మార్కెట్ 1.7 శాతం వృద్ధితో 2028 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ (35 బిలియన్ డాలర్లు), భారత్ (17 బిలియన్ డాలర్లు), కొరియా (14 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (11 బిలియన్ డాలర్లు) ఉంటాయి.
కనెక్టివిటీ దన్ను..
మెరుగైన ఇంటర్నెట్, కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడం, ప్రీమియం లోకల్ కంటెంట్‌పై ఇన్వెస్ట్ చేస్తుండటం, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం మొదలైన అంశాల వల్ల ఆసియా–పసిఫిక్ వీడియో పరిశ్రమ క్రమంగా టీవీ నుంచి ఆన్‌లైన్ వైపు వెడుతోందని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఆదాయాలు, వీక్షకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం కాగలదని పేర్కొంది.
2023లో 5.5 శాతం వృద్ధి ..
ఏపీఏసీ వీడియో పరిశ్రమ ఆదాయం 2023లో 5.5 శాతం వృద్ధి చెందింది. 145 బిలియన్ డాలర్లకు చేరింది. ఆన్‌లైన్ వీడియో విభాగం ఇందుకు దోహదపడింది. ఏపీఏసీలో గతేడాది చైనా అగ్రస్థానంలోనే కొనసాగింది. 64 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా నిల్చింది. చైనాను పక్కన పెడితే గతేడాది అతి పెద్ద మార్కెట్లలో జపాన్ (32 బిలియన్ డాలర్లు), భారత్ (13 బిలియన్ డాలర్లు), కొరియా (12 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (9.5 బిలియన్ డాలర్లు), తైవాన్, ఇండొనేషియా ఉన్నాయి. వినియోగదారులు ఆన్‌లైన్ వైపు మళ్లుతుండటం, కనెక్టెడ్ టీవీలు పెరుగుతుండటంతో టీవీ మాధ్యమంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment