ఆర్థిక మోసాలను అణిచివేసేందుకు ప్రభుత్వం 379 అక్రమంగా రుణాలందించే వెబ్‌సైట్‌లను, 91 ఫిషింగ్ సైట్‌లను తొలగించినట్లు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అక్టోబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్యకాలంలో 379 అక్రమంగా రుణాలిస్తున్న వెబ్‌సైట్‌లను మూసివేసింది. 91 ఫిషింగ్ సైట్‌లను తొలగించింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ప్రతిపాదించే ‘.in’ డొమైన్‌ల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ)తో ఐ4సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జనవరి 31న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో ‘రిపోర్ట్ సస్పెక్ట్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దాంతో అనుమానాస్పద వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌తో చేసిన సైబర్ క్రైమ్‌ను త్వరగా గుర్తించవచ్చు. వెంటనే సంబంధిత శాఖకు ఈ విషయాన్ని నివేదించవచ్చు. వీటిలో ఇప్పటివరకు 5,252 రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించడానికి ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను ఏర్పాటు చేశాం. దాని ద్వారా 7.6 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.2,400 కోట్లు ఆదా చేశాం’ అన్నారు.
ఇదీ చదవండి: పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ ప్రత్యేక డూడుల్!
2024 వార్షిక నివేదికలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సుమారు 36,000 ఆర్థిక మోసాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో వీటి సంఖ్య 9,000 ఉండడం గమనార్హం. 2024 వరకు ఇవి ఏకంగా 300 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక మోసాలను పరిష్కరించడంలో భాగంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఆర్‌బీఐ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment