న్యూఢిల్లీ: దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆరేళ్ల వ్యవధిలో (2019–24) 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారు. దీంతో 2027 ఆఖరు నాటికి ఈ విభాగంలోకి మొత్తం పెట్టుబడులు 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీ య సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి‘ అని నివేదిక పేర్కొంది. పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
అసాధారణ వృద్ధి..
పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వ తోడ్పాటు, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల దన్నుతో భారత డేటా సెంటర్ మార్కెట్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోందని సీబీఆర్‌ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బీఎఫ్‌ఎస్‌ఐ, టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ రంగాల నుంచి డిమాండ్ నెలకొనడం, రాష్ట్రాల స్థాయిలో పాలసీలపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
2025 ఆఖరు నాటికి భారత డేటా సెంటర్ సా మర్థ్యం 2,070 మెగావాట్ల స్థాయికి చేరు కోనుంది. ప్రస్తుతం ఇది 1,255 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి 1,600 మెగావాట్లకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
డేటా సెంటర్ల సంఖ్యాపరంగా ముంబై అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాల్లో 90 శాతం ఈ నగరాల్లోనే ఉన్నాయి.
టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడం, డిజిటల్ పరివర్తన, ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, సానుకూల విధానాలు, (ఏఐ) ఆధారిత డేటా మొదలైనవి డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడగలవు. అలాగే ఈ విభాగానికి మౌలిక రంగం హోదా ఇవ్వడం సైతం ఇందుకు దోహదపడుతున్న కీలకాంశాల్లో ఒకటి. దీనితో ఆపరేటర్లు, డెవలపర్లకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. డిజిటల్ వ్యక్తిగత డేటా భ ద్రత చట్టం (డీపీడీపీఏ) అమలు అనేది చట్ట బద్ధమైన డేటా ప్రాసెసింగ్‌కు, సంబంధిత వర్గాల విశ్వాసాన్ని చూరగొనేందుకు దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment