న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) డిసెంబర్ 8న వాటాదారుల అత్యవసర సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. వెలుపలి సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా వాటాదారులకు సూచించింది. కంపెనీలో ఉమ్మడిగా 24.92 శాతం వాటా కలిగిన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అతుల్ కిర్లోస్కర్, రాహుల్ కిర్లోస్కర్ డిమాండుమేరకు ఈజీఎంను చేపట్టినట్లు తెలియజేసింది.
కిర్లోస్కర్ సోదరుల మధ్య వివాదాలు తలెత్తడంతో కేబీఎల్ చైర్మన్, ఎండీ సంజయ్ కిర్లోస్కర్ ఒకవైపు, అతుల్, రాహుల్ మరోవైపు చేరారు. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలన్న డిమాండుపై ఈజీఎంను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆరేళ్లలో న్యాయ, వృత్తిపరమైన కన్సల్టెన్సీ చార్జీలకు సంబంధించి కంపెనీ చేసిన వ్యయాలపై పరిశోధన చేపట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ ఎంపికను కోరుతున్నట్లు వివరించింది. కాగా.. బోర్డు ఈ ప్రతిపాదనలను సమర్థించడంలేదని కేబీఎల్ పేర్కొంది. బోర్డు, డైరెక్టర్ల స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment