‘ఓలా మా డేటా కాపీ చేసింది’ | MapMyIndia taking Ola Electric to court for copying data | Sakshi
Sakshi News home page

‘ఓలా మా డేటా కాపీ చేసింది’

Published Tue, Jul 30 2024 10:55 AM | Last Updated on Tue, Jul 30 2024 11:09 AM

MapMyIndia taking Ola Electric to court for copying data

స్వదేశీ డిజిటల్ మ్యాపింగ్ సేవల సంస్థ మ్యాప్‌ మై ఇండియా తన డేటాను ఓలా ఎలక్ట్రిక్‌ కాపీ చేసిందని ఆరోపించింది. ఓలా మ్యాప్స్‌లో సంస్థ తయారుచేసిన మ్యాప్‌ డేటాను వాడుతున్నట్లు మ్యాప్‌ మై ఇండియా చెప్పింది. గతంలో ఇరు కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్‌ ఉల్లంఘించిందని తెలియజేస్తూ కోర్టును ఆశ్రయించింది.

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లో మ్యాపింగ్‌ సేవలందించేందుకు రెండు కంపెనీలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. అయితే మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ‘కో-మింగ్లింగ్‌’, రివర్స్ ఇంజినీరింగ్, ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్), ఎస్‌డీకే(సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌)లోని కీలక మ్యాప్‌ డేటా వివరాలను ఒప్పందానికి విరుద్ధంగా ఓలా కంపెనీ కాపీ చేసినట్లు ఆరోపణల్లో తెలిపింది. ఓలా ఒప్పంద నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టులో దావా వేసినట్లు మ్యాప్‌ మై ఇండియా పేర్కొంది. ఈమేరకు మ్యాప్‌ మై ఇండియా సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ఓలాకు నోటీసులు పంపించింది.

ఈ వ్యవహారంపై ఓలా స్పందిస్తూ..మ్యాప్‌ మై ఇండియా చేసిన ఆరోపణనలను తీవ్రంగా ఖండించింది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. మ్యాప్‌ మై ఇండియా పంపిన నోటీసుకు త్వరలో తగిన విధంగా స్పందిస్తామని చెప్పింది.

ఇదీ చదవండి: రూ.1,799కే 4జీ ఫోన్‌!

ఇదిలాఉండగా, జులై మొదటివారంలో ఓలా ప్లాట్‌పామ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగించబోమని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సొంత లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గూగుల్‌ ‍మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది. గ్లోబల్ మ్యాపింగ్ లీడర్ గూగుల్ భారతదేశంలోని కస్టమర్ల కోసం గూగుల్ మ్యాప్స్ ధరలను 70 శాతం తగ్గించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement