గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు
సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్
నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్
డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్
ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం)
బీపీసీల్ భళా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు)
ఐడియా జోరు
డెరివేటివ్స్‌లో ఐడియా 6.3 శాతం జంప్‌చేయగా.. కంకార్, హెచ్‌పీసీఎల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఎన్‌ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్‌ఈసీ, అరబిందో, డీఎల్‌ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment