
మార్కెట్‌లో దూసుకెళ్లడం కోసం కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుడగలు వేస్తుంటారు వ్యాపారులు. కార్పోరేట్ కంపెనీల నుంచి గల్లీ కొట్టు వరకు వారి వారి స్థాయిల్లో వివిధ పద్దతుల్లో ప్రచారం చేస్తుంటారు. ఫెస్టివల్ సీజన్, స్టాక్ క్లియరెన్స్ పేరుతో ఇప్పటి వరకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వారణాసికి చెందని ఓ మొబైల్ స్టోర్ యజమాని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సరికొత్త ప్రచారానికి తెర తీశాడు.
వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్టోర్‌లో పది వేల రూపాయలకు పైగా విలువైన ఫోన్‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామంటూ ప్రకటించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై ఐదు నిమ్మకాయలు కూడా ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది.
మిగిలిన మొబైల్ స్టోర్లకు భిన్నంగా మొబి వరల్డ్ ప్రకటించిన ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మండుటెండలో కూడా ఈ ఆఫర్ ఏంటా అని తెలుసుకునేందుకు స్టోర్‌కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా అమ్మకాలు కూడా బాగున్నాయంటున్నారు స్టోర్ నిర్వాహకులు. మార్కెట్‌లో పెట్రోల్, నిమ్మకాయల రేట్లు మండిపోతుండటంతో వాటిని ఉచితంగా అందిస్తామంటూ ఆఫర్ ప్రకటించడం తమకు కలిసి వచ్చిందంటున్నారు స్టోర్ నిర్వాహకులు.
చదవండి: యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు