అమెరికాలో మూడో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా మోటరోలా రికార్డు సృష్టించింది. ప్రముఖ మార్కెట్ ఎనాలసిస్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2021 ఏడాదికి సంబంధించి యాపిల్, శామ్‌సంగ్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది మోటరోలా.
అమెరికా మార్కెట్‌లో ఆది నుంచి యాపిల్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానం కోసం శామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ, ఎల్‌జీ, సోనీ, మోటరోలా కంపెనీలు పోటీ పడ్డాయి. ఆండ్రాయిడ్ రాకతో బ్లాక్‌బెర్రీ ఈ రేసు నుంచి తప్పుకోగా మిగిలిన కంపెనీలు ఈ పరుగులో పోటీ పడ్డాయి. అయితే సోని, ఎల్‌జీ కంపెనీలు మార్కెట్‌లో ఆటుపోట్లను ఎదుర్కొలేక క్రమంగా స్మార్ట్‌ఫోన్ తయారీ నుంచి తమ ప్రయత్నాలను విరమించుకోవడం లేదా నామామాత్రంగా మిగలడమో జరిగింది.
మోటరోలా విషయానికి వస్తే గూగుల్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత మోటరోల దశ తిరుగుతుందని భావించారు. కానీ అటువంటి అద్భుతాలేమీ జరగకపోవడంతో మోటరోలాని లెనోవోకి అమ్మేసింది గూగుల్. ఇక లెనోవో చేతికి వెళ్లిన తర్వాత బడ్జెట్ ఫోన్లపై ప్రధానంగా ఫోకస్ చేసింది మోటరోలా. ఇప్పుడదే ఆ కంపెనినీ గట్టెక్కించింది.
అమెరికా మార్కెట్‌లో 400, 300 డాలర్ల రేంజ్ ధరలో మోటరోలా సుస్థిర స్థానం సాధించింది. ముఖ్యంగా మోటోజీ స్టైలస్, మోటోజీ పవర్, మోటోజీ ప్యూర్ మోడళ్లు ఆ కంపెనీని అమెరికాలో తిరిగి నిలబెట్టాయి. దీంతో గతేడాది ఆ కంపెనీ మార్కెట్ ఏకంగా 131 శాతం వృద్ధిని కనబరిచింది.
అమెరికా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను పరిశీలిస్తే 58 శాతం మార్కెట్‌తో యాపిల్ ప్రథమ స్థానంలో ఉండగా 22 శాతం మార్కెట్‌తో శామ్‌సంగ్ రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ఉన్న కంపెనీలే 80 శాతం మార్కెట్‌ని కైవసం చేసుకున్నాయి. పది శాతం మార్కెట్‌తో మోటరోలా తృతీయ స్థానంలో నిలిచింది. చైనా కంపెనీలు అమెరికా మార్కెట్ పోటీలో నిలవలేకపోయాయి.
చదవండి: వచ్చేస్తోంది..వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment