ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. రూ.7,35,000 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల (రూ. 16,386 కోట్లు) రుణం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత విజయవంతమైన వ్యాపారాల శ్రేణిని కలిగి ఉన్న రిలయన్స్ గ్రూప్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రుణాన్ని కోరుతోంది.
రుణం కోసం రిలయన్స్ విదేశీ వాణిజ్య రుణ మార్గాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదక ప్రకారం.. ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్ కంపెనీ ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది.
టచ్‌లో ఉన్న బ్యాంకులు ఇవే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లతో కంపెనీ టచ్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముఖేష్ అంబానీ గత 10 సంవత్సరాలుగా టెలికాం, కన్జ్యూమర్ బిజినెస్ రంగాల్లో వైవిధ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలను ప్రారంభించారు. అవి భారీగా విజయవంతమయ్యాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ముడి చమురు శుద్ధి ప్రధాన వ్యాపారంగా ఉంది. జియో, రిటైల్ వ్యాపారాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ కంపెనీ కొత్త ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను 2020లోనే ముఖేష్ అంబానీ రుణ విముక్తంగా ప్రకటించారు. కానీ టెలికాం, రిటైల్ రంగాలలో విస్తరణలో భాగంగా ఇటీవల నిధుల సేకరణ జరుపుతోంది. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా 3 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. అనంత్ అంబానీ నేతృత్వంలో కంపెనీ 2030 నాటికి గ్రూప్‌కు 10-15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెస్తుందని ఇటీవల ఒక విదేశీ సంస్థ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment