న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్‌వర్క్ ఉంది. నెస్లే హెల్త్‌సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్‌నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్‌గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు.
ధరలు తగ్గిస్తారా..?
ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు.
పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా
పెరగొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment