కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే | New Income Tax India E Filing Website: Features, Details, Benefits | Sakshi
Sakshi News home page

కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Published Mon, Jun 7 2021 2:10 PM | Last Updated on Mon, Jun 7 2021 2:14 PM

New Income Tax India E Filing Website: Features, Details, Benefits - Sakshi

కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను సోమవారం(ఈ నెల 7న) ప్రారంభించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు అంతరాయాలు లేని, సౌకర్యవంతమైన అనుభవం నూతన పోర్టల్‌ ద్వారా అందించనున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ముందస్తు పన్ను చెల్లింపుల గడువు ముగిసిన తర్వాత జూన్‌ 18న నూతన పన్ను చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. గత వారం రోజులుగా ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌ పనిచేయలేదు. పోర్టల్‌ని అప్‌డేట్‌ చేయడమే ఇందుకు కారణం. నేటి నుంచి ఈ పోర్టల్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది. పన్ను చెల్లించేవారికి, సంబంధిత వర్గాలందరికి ఇది ఎంతో ఉపయోగకరం.  

  • ఆధునీకరించిన ఈ పోర్టల్‌.. ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుంది.  
  • రిటర్నులు వేయడం, అసెస్‌మెంట్లు చేయడం, రిఫండ్‌ జారీ చేయడానికి అనుసంధానించడం వల్ల రిఫండులు త్వరగా రాగలవు.  
  • డ్యాష్‌బోర్డు మీద మీకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కనిపిస్తాయి.  
  • ఐటీఆర్‌ వేయడానికి అనువైన సాఫ్ట్‌వేర్‌ ఉచితం. ఫోన్‌ ద్వారా మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు.  
  • సందేహాలకు జవాబులుంటాయి. వీడియో ద్వారా మీకు పాఠాలు చెబుతారు. ఆన్‌లైన్‌ పాఠాలు ఉంటాయి.  
  • మొబైల్‌ అప్లికేషన్‌ కూడా అందుబాటులోకి వస్తోంది. 
  • పెద్ద ఉపశమనం ఏమిటంటే పన్నుని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్‌ కార్డు, ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా పన్నులు చెల్లించవచ్చు. 
  • జూన్‌ 1 నుంచి 6వ తారీఖు వరకు ఈ పోర్టల్‌ని తయారు చేశారు. ఈ రోజుల్లో ఎటువంటి కార్యకలాపాలూ జరగలేదు. ఎటువంటి కేసులు వినలేదు. అసెస్‌మెంట్లు చేయలేదు. ఒకవేళ ఎవరికైనా నోటీసులు వచ్చినా ఆ గడువు తేదీలను సవరిస్తారు. 
  • జూన్‌ 10 నుంచి కేసుల పరిష్కరణ, అసెస్‌మెంట్‌ మొదలవుతాయి. కొత్త పోర్టల్‌ పూర్తిగా వాడుకలోకి వచ్చే వరకూ కాస్త సంయమనం పాటించడం శ్రేయస్కరం.  

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని గడువు తేదీలను సవరించారు. పొడిగించారు. ఫారం 16 జారీ చేయడానికి గడువు తేదీ జులై 15. ఇది అయిన తర్వాత ఫారం 16ఎ, అటుపైన ఫారం 26ఎ అప్‌డేట్‌ అవుతుంది. అంతవరకూ ఓపిక పట్టాలి. ఫారం 26ఎలో సమస్త వివరాలు ఉంటాయి. సదరు ఆర్థిక సంవత్సరంలో మీ ఆర్థిక వ్యవహారాలన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. సంవత్సరం పంచాంగం..జాతకం.. కుండలీ చక్రం అన్నీ ఇదే. అన్ని వ్యవహారాలను అర్థం చేసుకోండి. విశదీకరించండి. ఇక విశ్లేషణ వారి వంతు.

ట్యాక్సేషన్‌ నిపుణులు
కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement