
తొలిసారి 76 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్
ఆఖర్లో అమ్మకాలతో స్వల్ప నష్టాల ముగింపు
ముంబై: ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాలు ఆర్జించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగసి తొలిసారి 76 వేల స్థాయిపై 76,010 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది.
నిఫ్టీ 154 పాయింట్లు బలపడి 23,111 వద్ద ఆల్‌టైం అందుకుంది. అయితే ఆఖరి గంటలో సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఇంధన, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 22,932 వద్ద స్థిరపడింది. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.63%, 0.10% చొప్పున రాణించాయి.