Debt At Low Interest: కరోనా ఆంక్షలు ముగిసిన తర్వాత ఒకేసారి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు, శుభకార్యాలకు హాజరవడం వంటివి మీద పడుతున్నాయి. మరోవైపు పెట్రోలు సహా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా చాలామందికి తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
వడ్డీ తిప్పలు
బయట అప్పు తీసుకుంటే వడ్డీ రేట్లు అధికం. ప్రతీ నెల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామంటే అక్కడా వడ్డీ పోటు తప్పడం లేదు. బంగారం తాకట్టులోనూ ఇదే పరిస్థితి. చిన్న ఆర్థిక అవసరం కోసం తాకట్టు పెడితే వడ్డీల లెక్కలతో బంగారం దూరమయ్యే అవకాశమే ఎక్కువ. అతి తక్కువ వడ్డీతో సాధారణ ఆర్థిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంది. తక్కువ వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే మార్గాలు మీ కోసం.
శాలరీ ఓవర్ డ్రాఫ్ట్
ప్రతీ నెల జీతం తీసుకునే ఉద్యోగులు బయట అప్పులు చేయకుండా తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న అవకాశాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ ఒకటి. ప్రతీ నెల తీసుకునే జీతానికి మూడింతల సొమ్మును బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ద్వారా పొందవచ్చు. సాధారణంగా ఓడీలో తీసుకున్న సొమ్మును 12 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈఎంఐ తరహాలో వడ్డీ విధించరు. ఎంతకాలానికి, ఎంత సొమ్ము ఉపయోగించామనే దాన్ని బట్టే బ్యాంకు వడ్డీ విధిస్తుంది. ఎలాంటి పెనాల్టీ ఛార్జెస్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఓడీని క్లోజ్ చేయోచ్చు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఓడీ ద్వారా త్వరగా సులువుగా అవసరానికి డబ్బును సర్థుబాటు చేసుకోవచ్చు.
పేడే లోన్స్
రాబోయే నెల జీతం నుంచి ముందుగానే డబ్బులు తీసుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని పేడే లోన్ అంటారు. తక్కువ కాలానికి తక్కువ మొత్తంలో డబ్బును తీసుకునేందుకు పేడే లోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ లోన్‌ను ఒకేసారి చెల్లిస్తారు. సాధారణంగా నెల జీతంలో ఈ లోన్ కట్ అవుతుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ లోన్
మనకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద తక్కువ వడ్డీకే లోను పొందే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)కి సంబంధించిన మొత్తంలో 85 నుంచి 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు.
కోవిడ్ లోన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీతో కోవిడ్ లోన్‌ను ప్రవేశపెట్టింది. 2021 ఏప్రిల్ తర్వాత కోవిడ్ సోకిన వారు మెడికల్, ఇతర ఖర్చుల నిమిత్తం ఈ లోనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన శాలరీ, నాన్ శాలరీ ఎంప్లాయిస్‌తో పాటు పెన్షనర్లు కూడా ఈ లోను తీసుకునేందుకు అర్హులు.
మ్యూచువల్ ఫండ్ లోన్
అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై తక్కువ వడ్డీతో లోను తీసుకొవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మ్యూచువల్‌ఫండ్‌లో కొంత మొత్తాన్ని అమ్మకానికి పెట్టి లోను లేదా ఓడీని పొందవచ్చు. ఉపయోగించిన సొమ్ముకే వడ్డీని విధిస్తారు. లోను మొత్తానికి వడ్డీని లెక్కించరు.
Comments
Please login to add a commentAdd a comment