![Policybazaar parent to continue chasing long-term growth after IPO - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/28/POLICY-BAZAR.gif.webp?itok=oLuHAbvu)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫాం పాలసీబజార్, రుణాలకు సంబంధించిన పోర్టల్ పైసాబజార్‌ల మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ తాజాగా తమ పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ప్రతిపాదిత ఐపీవో నవంబర్ 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. షేరు ధర శ్రేణి రూ. 940–980గా ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ యశీష్ దహియా వర్చువల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,710 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు.
ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, ఆఫ్‌లైన్‌లో కూడా విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు దహియా పేర్కొన్నారు. అలాగే వ్యూహాత్మక పెట్టుబడులు .. కొనుగోళ్లకు, విదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికల కోసం కూడా కొంత మేర నిధులు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు.
ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్‌హోల్డర్లు దాదాపు రూ. 1,960 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా 75 శాతం భాగాన్ని అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment