Premium Electronics in Offline Stores To Boost Sales - Sakshi
Sakshi News home page

ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్‌: పెరుగుతున్న ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లు

Published Fri, Feb 24 2023 5:20 PM | Last Updated on Fri, Feb 24 2023 6:01 PM

Premium electronics in offline stores to boost sales - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15 -16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్‌ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్‌లైన్‌ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్‌లైన్‌ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్‌ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్‌ చేశాయి. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. 

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌ పెరిగిందని ఎల్‌జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్‌ జోన్స్, ఔట్‌లెట్స్‌ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. 

ఒకదాని వెంట ఒకటి..
దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్‌ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్‌సంగ్‌ ఓపెరా హౌజ్‌ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్‌ హోమ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్‌ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్‌ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్‌ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్‌మీ సైతం ఔట్‌లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్‌ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్‌ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్‌ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్‌ ఉంది.

ప్రీమియం వైపునకు మార్కెట్‌..
దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్‌ ప్యూరిఫయర్స్‌ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్‌జీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ బన్సాల్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement