యూఎస్‌పోలో, ఫ్యాబ్ ఇండియా, అడిడాస్, డెకథ్లాన్
లిస్టింగ్‌కు క్యూ కడుతున్న కంపెనీలు
మార్కెట్ విస్తరణతో అమ్మకాల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: క్విక్‌కామర్స్‌కు పట్టణ వాసుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో.. ప్రముఖ బ్రాండ్‌లు అమ్మకాలు పెంచుకునేందుకు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యాబ్ ఇండియా, డెకథ్లాన్, అడిడాస్, యూఎస్ పోలో, బోట్ తదితర ప్రముఖ బ్రాండ్లు బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను ఇటీవలి కాలంలో లిస్ట్ చేశాయి. పుమా, స్కెచర్స్ సైతం క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్టింగ్‌కు ఉత్సాహం చూపిస్తున్నాయి.
‘‘ఇది కేవలం ఆరంభమే. వేగం, సౌకర్యం దేశంలో ప్రజల షాపింగ్ తీరును మార్చివేయనున్నాయి’’అని జెప్టో అప్పారెల్ లైఫ్‌స్టయిల్ హెడ్ ఆస్థా గుప్తా తెలిపారు. క్విక్ కామర్స్ సంస్థలు ఇంతకాలం మెట్రోలకే పరిమితం కాగా, టైర్–2, 3 పట్టణాల్లోకి విస్తరిస్తున్నాయి. కనుక ఈ విభాగాన్ని ప్రముఖ బ్రాండ్లు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన ‘తస్వ’ మెన్స్‌వేర్ బ్రాండ్, డిజైనర్ తరుణ్ తహిల్యాని క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను లిస్టింగ్ చేసే ప్రణాళికతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ బ్రాండ్లు తమ స్టోర్ల కోసం సరైన లొకేషన్‌ను గుర్తించడం, అమ్మకాల పరంగా విజయం సాధించడం క్లిష్టమైన టాస్క్ అనడంలో సందేహం లేదు. అదే క్విక్ కామర్స్ అయితే మరింత మంది వినియోగదారులకు వేగంగా, సులభంగా చేరుకోగలగడం వాటిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో నాసిక్, వారణాసి, ఉదయ్‌పూర్, హరిద్వార్, బటిండ తదితర చిన్న పట్టణాలకూ క్విక్‌కామర్స్ సేవలు విస్తరించడం గమనార్హం.
స్పందన చూద్దాం..
క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో దీర్ఘకాల ఒప్పందాలకంటే, ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం బ్రాండ్లకు ఇది ప్రయోగాత్మక దశ. ఆడిదాస్, ఫ్యాబ్ ఇండియా తదితర బ్రాండ్లకు భారీ అమ్మకాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి కేవలం అప్పారెల్ కంపెనీలు. ఈ ఉత్పత్తుల్లో వెనక్కి తిరిగి పంపడం ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోళ్లలో 25–30 శాతం వెనక్కి వస్తుంటాయి. కనుక వీటి విషయంలో విజయం ఎంతన్నది వేచి చూస్తే కానీ తెలియదు. అదే గ్రోసరీ, స్టాపుల్స్, సౌందర్య ఉత్పత్తులు, బహుమతులు, మొబైల్ ఉత్పత్తులు క్విక్ కామర్స్‌పై ఎక్కువ డిమాండ్ ఉన్న విభాగాలు’’అని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తురాణి వివరించారు.
సంప్రదాయ స్టోర్లపై ప్రభావం..
క్విక్‌కామర్స్ శరవేగంగా విస్తరిస్తుండడం సంఘటిత స్టోర్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికం డీమార్ట్ ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితాల తర్వాత స్టాక్ కూడా భారీగా పడిపోవడం గమనార్హం. పెద్ద మెట్రోల్లో క్విక్ కామర్స్ సంస్థల రూపంలో డీమార్ట్ వంటి స్టోర్లకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు బ్రోకరేజీ సంస్థలు తమ విశ్లేషణలో పేర్కొన్నాయి. క్విక్ కామర్స్ కంపెనీలు తొలుత తక్షణ గ్రోసరీ డెలివరీ సేవలతో వ్యాపారం మొదలు పెట్టగా, కస్టమర్ల స్పందన ఆధారంగా తర్వాతి కాలంలో మరిన్ని విభాగాల్లోకి సేవలను విస్తరించాయి. గృహోపకరణాలు, చార్జింగ్ కేబుళ్లు, ఎయిర్‌కూలర్లు, ఐఫోన్లు, ఆట»ొమ్మలు ఇలా ఎన్నో ఉత్పత్తులను జోడించుకుంటూ వెళుతున్నాయి. ఇది సంప్రదాయ రిటైల్ పరిశ్రమను దెబ్బతీస్తుందని, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు వర్తకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment