RATAN TATA Birthday Special: Ratan Tata Incomplete Love Story in Telugu - Sakshi
Sakshi News home page

Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది 

Published Tue, Dec 28 2021 1:18 PM | Last Updated on Tue, Dec 28 2021 7:06 PM

RATAN TATA Birthday Special Story: A Love Story Of A Patriotic Businessman - Sakshi

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తామంటే ఇది దారుణమంటూ ప్రతిపక్షాలు నిరసిస్తాయి. దేశాన్ని తాకట్టు పెట్టారంటూ వామపక్షాలు గోల చేస్తాయి. మాకు సరైన అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడతాయి. దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరుగుతాయి. కానీ ఒక ప్రైవేటు సంస్థ పేరు చెబితే ఈ నిరసనలు, ధర్నాలు, గోల అంతా సద్దుమణుగుతాయి. తాజాగా జరిగిన టాటా - ఎయిర్‌ ఇండియా డీల్‌ ఇందుకు చక్కని ఉదాహారణ. ఈ ప్రైవేటీకరణకి దేశం నలుమూలల సానుకూల స్పందన వ్యక్తమైంది. దీనికి కారణం ఆ ప్రైవేటు సంస్థను నడిపిస్తున్న వ్యక్తి, అతను పాటిస్తున్న విలువలే కారణం.  

ఒక్కడు
భారత కీర్తి కిరీటంలో ఎన్నో వజ్రాలను పొదిగిన రతన్‌ టాటాకు ఓ ప్రేమకథ ఉంది. సాధారణంగా ప్రేమికులు ఏకమయ్యేందుకు ఆస్తులు, అంతస్థులు, కులాలు, మతాలు, వ్యక్తిగత ఇగోలు కారణం అవుతాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం  రతన్‌ టాటా ప్రేమ భగ్నం కావడానికి కారణమైంది. తొలిప్రేమను మరిచిపోలేని రతన్‌టాటా ఆ తర్వాత పెళ్లి ప్రస్తావనే తేకుండా జీవితాన్ని సాగించాడు. జీవితంలో ఎన్నో విజయశిఖరాలను ఒకేఒక్కడిగానే అధిరోహించారు. ఇప్పటికీ అవివాహితుడిగానే ఉండిపోయారు. పలు సందర్భాల్లో తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన చెప్పిన విషయాల ఆధారంగా ఆయన ప్రేమకథ మీకోసం

నాన్నమ్మ పెంపకం
దేశంలోనే ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో ఒకటైన టాటాల ఇంట 1937 డిసెంబరు 28న రతన్‌ టాటా జన్మించాడు. అతనికి పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే వ్యక్తిగత విబేధాల కారణంగా తల్లిదంద్రులైన నావల్‌ టాటా, సోనూలూ 1948లో విడిపోయారు. ఆ తర్వాత నాన్నమ్మ నవాజ్‌భాయ్‌ టాటా సంరక్షణలో అల్లారుముద​‍్దుగా పెరిగాడు రతన్‌ టాటా. ముంబై, షిమ్లాలలో ఉన్న బోర్డింగ్‌ స్కూల్స్‌లో చదువుకుని నాన్నమ్మ కోరిక మేరకు ఇంజనీరింగ్‌ చదివేందుకు అమెరికా ప్రయాణమయ్యారు. 

తొలిప్రేమ
అమెరికాలోని కోర్నెల్‌ యూనివర్సిటీలో అర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌, హర్వర్డ్‌ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్‌ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్‌ఏంజెలెస్‌లో ఓ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా చేరాడు. ఉరకలెత్తే ఉత్సాహం, స్వతంత్ర జీవితం, కొత్త కారు అంతా హుషారుగా సాగిపోతున్న సమయంలో అక్కడే ఓ యువతితో పరిచయమైంది రతన్‌టాటాకి. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమ బంధంగా మారింది. దీంతో ఈ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు రతన్‌టాటా.

రెక్కలు కట్టుకుని
తన ప్రేమ విషయం పెద్దలకు చెప్పేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇండియా నుంచి రతన్‌ టాటాకి కబురు వచ్చింది. తనను పెంచి పెద్ద చేసిన నాన్నమ్మకి ఆరోగ్యం బాగాలేదని, ఇండియాకి వెంటనే రమ్మంటూ పిలిచారు. నాన్నమ్మ అనారోగ్యంపై ఆందోళన ఉన్నా.. ఇండియాకి వెళ్లగానే తన ప్రేమ విషయం చెప్పేయాలనే ఉత్సాహంతో ఇండియాకి వచ్చాడు రతన్‌టాటా.

పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌
రతన్‌టాటా ప్రేమ విషయం ఇంట్లో తెలియనగానే అనేక తర్జనభర్జనల అనంతరం టాటా కుటుంబం పెళ్లికి అంగీకారం తెలిపింది. అమెరికాలో ఉన్న ప్రేయసికి ఈ విషయం సంతోషంగా చెప్పాడు టాటా. నాన్నమ్మ ఆరోగ్యం బాగాలేనందున పెళ్లి ముచ్చట్లు మాట్లాడేందుకు ఇండియా రావాల్సిందిగా కోరాడు. మూడుముళ్లు , ఏడు అడుగులకు వేయడమే ఆలస్యం అనుకునే సమయంలో ఊహించని విపత్తు వచ్చి పడింది. 



ఊహించని విలన్‌
రతన్‌టాటా ప్రేమపెళ్లి ప్రయత్నాల్లో ఉండగానే 1962లో హిందీ చీనీ భాయిభాయి స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ వక్రబుద్దితో చైనా సరిహద్దుల వెంట అతిక్రమలు మొదలుపెట్టింది. స్వాతంత్రం పొంది ఇంటా బయట అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ఇండియాకు ఊహించని దిక్కు నుంచి ప్రమాదం వచ్చి పడింది. దీంతో సామాన్య పౌరులు మొదలు ప్రధాని వరకు ఆందోళన చెందారు. అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం నెలకొంది.
 

దేశాన్నే ప్రేమించారు
అమెరికాలో ఉన్న రతన్‌టాటా ప్రేయసి కుటుంబం యుద్ధ సమయంలో ఇండియాకు వచ్చేందుకు నిరాకరించింది. రతన్‌ ఎన్ని హామీలు ఇచ్చినా వారు ఇక్కడికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ యుద్ధంలో చైనా చేతిలో ఇండియా పరాజయం పాలైంది. ప్రధానితో సహా దేశంలో ఉన్న పెద్దలకు ఆ యుద్ద ఫలితం తలవంపులు తెచ్చి పెట్టింది. ఆ ఒత్తిడిలోనే ఏం జరిగిందో తెలియదు కానీ రతన్‌టాటాకు ఆయన ప్రియురాలితో సంబంధాలు తెగిపోయాయి. ఓ రకంగా వ్యక్తిగత ప్రేమకంటే దేశాన్నే ఎక్కువగా ప్రేమించారు రతన్‌టాటా. అందుకే లవ్‌ లైఫ్‌కి ‘టాటా’ చెప్పారు. ఈ ప్రేమ జ్ఞాపకాల నుంచి బయటపడి కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టి విలువలకు కట్టుబడి టాటా కీర్తిని ప్రపంచం నలుమూలాల విస్తరించారు.

అటువైపు చూడలేదంతే
తొలిప్రేమ విఫలమైనా మలి ప్రేమలతో జీవితాన్ని వెతుకున్నవారు ఎందరో ఉన్నారు. కానీ రతన్‌టాటా ఆ ప్రయత్నం చేసినట్టు పెద్దగా కనిపించదు. అందుకు ఆయనకు జరిగిన అనుభవాలే అందుకు కారణం కావొచ్చు. రతన్‌ తల్లిదండ్రులైన నావల్‌టాటా, సోనులు దగ్గరి బంధువులు వివాహ బంధం వారి మనసులను కట్టి ఉంచలేకపోయింది. దీంతో పదేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ముఖ్యంగా సామాజిక చైతన్యం అంతగా లేని ఆ కాలంలో తల్లి మారు పెళ్లి చేసుకోవడాన్ని ఎత్తి చూపుతూ కొందరు రతన్‌ మనసును గాయపరిచారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. అందుకే మనసులు కలవనప్పుడు మనుషులు కలవడం వృధా అనుకున్నారేమో ? తొలిప్రేమ జ్ఞాపకాలతోనే జీవితాన్ని నడిపించారు.  

దేశమంటే..
దేశం ఎంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భంలోనే రతన్‌టాటా ప్రేమ విఫలమైంది. అమెరికా వెళ్లి ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలా ? లేదా ఇండియాలో ఉండి కుటుంబ వ్యాపారం చూసుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ప్రేమ కంటే దేశానికే ‍ ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకు అద్దం పట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 

ఫోర్డ్‌కి పాఠాలు
సరళీకృత ఆర్థిక విధానాలు దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత జపాన్‌, అమెరికా, కొరియా అందించే సాంకేతిక సహకారంతో దేశీయంగా అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ పూర్తి స్వదేశీ కారు లేదు. ఆ లోటు భర్తీ చేసేందుకు ఇండికా పేరుతో స్వదేశీ కారుని 1998లో మార్కెట్‌లోకి తెచ్చారు టాటా. కానీ ఆ కారు ముందుగా అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించిన నష్టాలు వచ్చాయి. వెంటనే అమెరికా వెళ్లిన రతన్‌టాటా అక్కడ ఫోర్డ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పుడేం చేయాలంటూ అడిగారు.. కార్ల గురించి ఏమీ తెలియని మీకు ఎందుకు సొంత కార్లు ? అంటూ హేళనగా మాట్లాడారు ఫోర్డ్‌ ప్రతినిధులు. ఇండికాను మా మద్దతు ఇవ్వలేం. కంపెనీ మూసేయండంటూ సలహా ఇచ్చారు. ఇండియాకి తిరిగి వచ్చిన టాటా పట్టుదలతో లోపాలు సవరించి టాటా ఇండికాను మార్కెట్‌లోకి తీసుకువచ్చి తిరుగులేని విజయం సాధించారు. ఈ ఘటన జరిగిన పదేళ్లకు ఫోర్డ్‌ కంపెనీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటే ఆ కంపెనీకి చెందిన ల్యాండ్‌రోవర్‌, జాగ్వర్‌ బ్రాండ్‌లను సొంతం చేసుకుని ఆ కంపెనీని ఒడ్డున పడేశారు. ఈ డీల్ మాట్లాడేందుకు అమెరికా రావాలంటూ ఫోర్డ్‌ ప్రతినిధులు కోరితే.. మీరే ఇండియాలోని ముంబైకి వచ్చి మాట్లాడమంటూ కాలర్‌ ఎగరేశారు టాటా. 

ఇక్కడ ప్రజల కోసం
దేశంలో కారు అనేది సంపన్నులకే పరిమితమైన ఒక సౌకర్యంగా ఉండేది. కానీ దేశంలో కోట్లాదిగా ఉన్న మధ్య తరగతి ప్రజలకు అది ఒక కల మాత్రమే. వారి కలను నిజం చేసేందుకు తన ఆర్‌ అండ్‌ టీం చేత ప్రపంచంలోనే అతి చవకైన టాటా నానో కారుని మార్కెట్‌లోకి తెచ్చారు. ఆ కారు పెద్దగా సక్సెస్‌ కాకపోయినా.. ఈ దేశ మట్టిపై ఇక్కడి ప్రజల్లో మెజారిటీగా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలపై ఆయనకున్న కన్‌సర్న్‌కి ప్రతీకగా నిలిచింది.

మాకు ఆ సత్తా ఉంది
ఫ్రీ మార్కెట్‌ విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. కానీ టాటా ఆ సం‍ప్రదాయాన్ని తిరగరాశారు. కోరస్‌ వంటి ప్రముఖ విదేశీ స్టీలు కంపెనీని టేకోవర్‌ చేసి భారత సత్తా చాటారు. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజీలో టాటాను లిస్ట్‌ చేయించి మన దమ్మెంటో చూపించారు. 

మాటంటే మాటే
వ్యాపారం చేసుకునే కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముడయ్యేందుకు ప్రకటనల్లో అద్భుతాలు చూపిస్తాయి. కానీ ఆచరించడంలో అంత శ్రద్ధ పెట్టరు. కానీ టాటా అందుకు భిన్నం. చెప్పిన వాటి కంటే ఎక్కువే చేసి చూపిస్తారు. టాటా గ్రూపు కింద ఉన్న కంపెనీల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెంచుతూ పోవాలని రతన్‌టాటా నిర్ణయించారు. దాని ఫలితమే అత్యధికమంది మహిళా ఉద్యోగులు ఉన్న కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ నిలిచింది. త్వరలోనే వంద శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థగా టాటా స్టీల్‌ రికార్డు సాధించనుంది. టాటా గ్రూపు ముంబైలో కడుతున్న కొత్తగా కడుతున్న హోటల్‌ నిర్మాణం పూర్తిగా మహిళా ఇంజనీర్ల పర్యవేక్షణలో జరుగుతోంది. అంతేందుకు టాటా గ్రూపు కింద వందకు పైగా వివిధ సంస్థలు ఉన్నా.. ఎన్నడూ దేశంలో సంపన్నుల జాబితాలో రతన్‌టాటా పేరు కనిపించదు. అందుకు కారణం సంస్థ ఆదాయంలో సింహభాగం టాటా ట్రస్టుకి వెళ్తుంది. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలకు ఆ సొమ్ము అందుతుంది. టాటా గ్రూపు సాధించే లాభాల్లో నామమాత్రపు ఆదాయమే రతన్‌టాటా తీసుకుంటారు. 

టాటా నీకు సలాం
తన వారసుడిగా సైరస్‌మిస్త్రీని టాటా చైర్మన్‌గా ప్రకటించి 2012లో విరామం తీసుకున్నారు. అయితే టాటా విలువలు ముందుకు తీసుకుపోవడంలో మిస్త్రీ విఫలమవుతున్నారని తెలిసిన మరుక్షణం ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించారు. 75 ఏళ్ల వయసులో వయో భారాన్ని లెక్క చేయకుండా మళ్లీ టాటా పగ్గాలు చేపట్టి విలువలకు పట్టం కట్టారు. అందుకే ఆయన ఎదురు పడితే ఎవరైనా చేతులెత్తి నమస్కారం పెడతారు. అందుకు ఉదాహారణ  ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి రతన్‌టాటాకి చేసిన పాదాభివందనం. 

- సాక్షి వెబ్‌, ప్రత్యేకం

చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement